43 మంది వైద్యులపై వేటు..!
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:21 AM
ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్న 43 మంది వైద్యులపై వేటు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
శాశ్వతంగా తొలగించాలని నిర్ణయం: మంత్రి సత్యకుమార్
అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్న 43 మంది వైద్యులపై వేటు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారిని శాశ్వతంగా తొలగించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గరిష్ఠంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వారికి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై అభియోగాలు నమోదు చేశామని చెప్పారు. నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో వారిని విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎ్‌సహెచ్) పరిధిలో దాదాపు 118 మంది అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారని మంత్రి తెలిపారు. వారిపై నిబంధనలను అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారని, ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైందని తెలిపారు. మరో 34 మంది వైద్యులు నోటీసులు తీసుకున్న తర్వాత డీఎ్‌సహెచ్ డైరెక్టర్ చక్రధర్‌బాబుకు రాజీనామా పత్రాలు సమర్పించారని తెలిపారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించనుందని చెప్పారు. మిగిలిన 19 మందిపై జిల్లాల వారీగా విచారణాధికారులను నియమించిందన్నారు. విచారణాధికారులు ఇచ్చే నివేదిక ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.