సముద్రంలో కలిసే వరదనే వాడుకుంటాం
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:03 AM
రాష్ట్ర పర్యటనలో ఉన్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జీఆర్‌ఎంబీ చైర్మన్‌కు స్పెషల్ సీఎస్ వివరణ
మంత్రి నిమ్మలతో బీపీ పాండే భేటీ
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనలో ఉన్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, కృష్ణా డెల్టా సీఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు గురించి సాయిప్రసాద్ క్లుప్తంగా పాండేకు వివరించారు. ఏటా సముద్రంలో కలుస్తున్న దాదాపు 3,000టీఎంసీల వరద జలాల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీలు మాత్రమే నల్లమలసాగర్‌కు పంపి కరువు జిల్లాలకు వినియోగించడం దీని ఉద్దేశమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరి జలాలను వినియోగించుకునేందుకు మరో రాష్ట్రం లేదని.. చిట్టచివరన ఉన్న రాష్ట్రం ఏపీనేనని గుర్తుచేశారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను సద్వినియోగం చేసుకుంటే.. ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. జీఆర్‌ఎంబీ నిర్వహణ కోసం రూ.2.5 కోట్లు విడుదల చేయాలని పాండే కోరగా.. విడుదల చేస్తామని ప్రభుత్వం తరఫున సాయిప్రసాద్ హామీ ఇచ్చారు.