Share News

ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:35 AM

ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో..

ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్‌

  • త్వరలో అందుబాటులోకి.. రూరల్‌ అన్న క్యాంటీన్లను సమర్థంగా నిర్వహించాలి

  • ప్రతిరోజూ తాగునీటి శాంపిళ్లను తీయాలి.. ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం ఆదేశాలు

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సేవలపై సీఎం సమీక్షించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలనూ ఆన్‌లైన్‌ చేశామని తెలిపారు. మన మిత్ర వాట్సాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా ఆన్‌లైన్‌ యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే తరహా సేవలు అందించాలన్నారు. ప్రజలకు తాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లను ప్రతిరోజూ పరీక్షించాలని స్పష్టం చేశారు. రక్షిత నీటి సరఫరాలో అశ్రద్ధ కనిపించొద్దన్నారు. మంచినీటి సరఫరా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాలను విజయవంతం చేయగలమని చెప్పారు. ప్రకృతి, పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలని, చెరువులన్నీ నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, ప్రతి కుంట, ప్రతి చెరువులోని నీటి నిల్వను ఆన్‌లైన్‌లో సమీక్షించాలని నిర్దేశించారు. అనంతపురం జిల్లాలో ఆన్‌లైన్‌ పరిశీలనా విధానాన్ని అమలు చేయాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టాలని, గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని స్పష్టం చేశారు.


సుపరిపాలనలో భాగంగా రాష్ట్రంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టామని, అధికారులు, ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా ఓరియంటేషన్‌ ఇస్తున్నామని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుని పరిపాలనలో కొత్త పద్ధతులను అమలు చేస్తున్నామని, టెక్నాలజీ డ్రివెన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీజీఎస్‌, అవేర్‌ వంటి వ్యవస్థలతో పరిపాలనలో నూతన విధానాలు తెస్తున్నామన్నారు. కేంద్రం ఈ తరహా పద్ధతులు అమలు చేసేందుకు ఆసక్తితో ఉందని, రాష్ట్రంలో అమలుచేస్తోన్న టెక్నాలజీ డ్రివెన్‌ సుపరిపాలపై ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్‌ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇద్దామని సూచించారు. సమీక్షలో మంత్రి కొలుసు పార్థసారథి, సీఎస్‌ జి.సాయిప్రసాద్‌, ఆర్టీజీఎస్‌ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:36 AM