‘నేతన్నకు భరోసా’ అమలుకు సిద్ధం!
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:05 AM
చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు.
చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి
మంగళగిరిలో ఘనంగా ఆప్కో స్వర్ణోత్సవాలు
మంగళగిరి సిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. దీంతో పాటు చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిల్లో ఈ నెల 15 రూ.4 కోట్లు, వచ్చే నెల మొదటి వారంలో మరో రూ.2.50 కోట్లను చెల్లిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆప్కో తోటలో సోమవారం సాయంత్రం ఆప్కో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతలు, సహకార సంఘాలకు వరాల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆప్కో బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆప్కోను లాభాల బాట పట్టిస్తామన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలన చేనేత రంగానికి స్వర్ణయుగమన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వ్యవస్థల మాదిరిగానే చేనేత రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. నేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందజేసే ఆలోచన చేస్తున్నామని, నేటి తరం అభిరుచులకు అనుగుణంగా చేనేత రెడీమేడ్ వస్త్రాలను తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.