Share News

AP Government: 27 బ్లాకుల్లో ఖనిజాన్వేషణ

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:58 AM

రాష్ట్రంలో మరోసారి భారీగా ఖనిజాల అన్వేషణ,, పరిశోధన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో...

AP Government: 27 బ్లాకుల్లో ఖనిజాన్వేషణ

  • మెరిట్‌ సమావేశంలో కీలక నిర్ణయం

  • ఐదు ప్రైవేటు సంస్థలతో ఎంప్యానల్‌ జాబితా

  • త్వరగా సీఈవో పోస్టు భర్తీకి తీర్మానం

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి భారీగా ఖనిజాల అన్వేషణ,, పరిశోధన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో 27 బ్లాకుల్లో ఖనిజాల అన్వేషణ ప్రారంభించాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చైర్మన్‌గా ఉన్న ఖనిజాన్వేషణ, పరిశోధన, ఆవిష్కరణల ట్రస్టు(మెరిట్‌) సమావేశం జరిగింది. మెరిట్‌ నిధులతో కడప, విజయనగరం, కృష్ణా, కర్నూలు జిల్లాల పరిధిలో సున్నపురాయికి సంబంధించి మూడు బ్లాక్‌లు, మాంగనీస్‌ ఆరు బ్లాక్‌లు, ముడి ఇనుప ఖనిజం ఒక బ్లాక్‌లో అన్వేషణ, పరిశోధన కార్యక్రమాలు చేపట్టాలని ఖరారు చేశారు. కేంద్ర సంస్థ ఎన్‌ఎమ్‌ఈటీ నిధులతో కడప, గుంటూరు జిల్లాల్లో సున్నపురాయి నిక్షేపాలను గుర్తించే పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో గ్రేడ్‌-2 సున్నపురాయు నిక్షేపాలు ఉంటాయని అంచనా. ప్రైవేటు సహకారంతో రామగిరి, బొకసంపల్లి, జవాకుల బ్లాకుల్లో బంగారం లభ్యత, త్వవకాలపై అన్వేషించాలనుకుంటున్నారు. ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రైవేటు సంస్థలను గుర్తించి వాటి సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం ప్రకారం కనీసం ఐదు ప్రైవేటు సంస్థలతో ఎంప్యానల్‌ జాబితాను తయారు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ట్రస్టు ఆదేశించింది. ట్రస్టు కార్యకలాపాలను మరింతగా పెంచేందుకుగాను కొత్తగా ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) పోస్టును త్వరితగతిన భర్తీచేయాలని నిర్ణయించారు. మెరిట్‌ సంస్థను మరింతగా బలోపేతం చేయాలని, నిధులను గ్రీన్‌చానల్‌ ద్వారా అందించాలని సమావేశంలో తీర్మానించారు.

Updated Date - Jan 20 , 2026 | 04:58 AM