Share News

మద్యంలో డిజిటల్‌ చెల్లింపులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:41 AM

మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు...

మద్యంలో డిజిటల్‌ చెల్లింపులు

  • 30 నుంచి 60శాతం పెంపే లక్ష్యం.. ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక పాలసీ.. షాపులు, బార్లలో అమలు తప్పనిసరి

  • ఎక్సైజ్‌ డేటాబేస్‌కు చెల్లింపుల డేటా

  • సీసాలు స్కానింగ్‌ చేసి అమ్మాల్సిందే

  • మంత్రివర్గం ఆమోదంతో అమలు

  • పారదర్శకతకు పెద్దపీటే లక్ష్యం

మద్యం విక్రయాల్లో మరింత పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఎక్సైజ్‌ శాఖ నూతన విధానం తీసుకురానుంది. ‘లిక్కర్‌ డిజిటల్‌ చెల్లింపులు’ పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. తద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ఫైలును మంత్రివర్గం ఆమోదించగానే పాలసీని అమలు చేయనున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు ‘లిక్కర్‌ డిజిటల్‌ చెల్లింపులు’ పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకురానుంది. మంత్రివర్గ ఆమోదం లభించగానే డిజిటల్‌ చెల్లింపుల విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. నెల రోజుల వ్యవధిలో ఈ పాలసీ అమల్లోకి వస్తుందని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. పాలసీ అమల్లోకి వచ్చాక ప్రతి బార్‌, మద్యం షాపులో కచ్చితంగా డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఈ విధానం ప్రకారం.. మద్య కొనుగోలుదారులు డిజిటల్‌ విధానంలో బిల్లు చెల్లిస్తానంటే లైసెన్సీలు తిరస్కరించకూడదు. దీనికిగాను ఎక్సైజ్‌ శాఖ షాపులు, బార్లకు డిజిటల్‌ చెల్లింపులకు అవసరమైన ఉపకరణాలను అందించనుంది.


ప్రస్తుత విధానంలో..

గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానం అమలవుతోంది. డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యం ఉండాలనే నిబంధనను మద్యం షాపులు, బార్‌ పాలసీల్లో ఎక్సైజ్‌ శాఖ పేర్కొంటోంది. ప్రతిసారీ పాలసీలో ఈ నిబంధన తప్పనిసరిగా పెట్టాల్సి వస్తోంది. అయితే, ఈ నిబంధనను షాపులు, బార్ల లైసెన్సీలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిసారీ మద్యం పాలసీల్లో ఈ నిబంధన పెట్టాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ చెల్లింపులను శాశ్వతంగా అమలుచేయడం కోసం ఈ పాలసీని ఎక్సైజ్‌ శాఖ తీసుకురానుంది. ప్రస్తుత విధానంలో డిజిటల్‌ చెల్లింపులు చేసినా ఆ విషయం సంబంధిత లైసెన్సీకి మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం సుమారు 30శాతం మేర డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నా ఆ సమాచారం ఎక్సైజ్‌కు చేరడంలేదు. నూతన పాలసీ అమల్లోకి వచ్చాక ఎవరు డిజిటల్‌ చెల్లింపులు చేశారనే సమాచారం రియల్‌టైమ్‌లో ఎక్సైజ్‌ డేటాబేస్‌లో నిక్షిప్తం అవుతుందని అధికారులు చెబుతున్నారు.


ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు

డిజిటల్‌ చెల్లింపులతో పాటు ఎక్సైజ్‌ శాఖ కొత్తగా ‘ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌’ విధానాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం మద్యాన్ని ఉత్పత్తి చేసే డిస్టిలరీల నుంచి నిల్వ చేసే డిపోల వరకు మాత్రమే తెలుసుకునే(ట్రాకింగ్‌) వ్యవస్థ ఉంది. మద్యం డిపోల నుంచి బార్లు, షాపులు మద్యం కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత వారు ఏ రోజు ఏ సమయంలో ఎంత మద్యం విక్రయించారో ప్రభుత్వానికి తెలియడం లేదు. దీంతో షాపులు, బార్లలో ఎంత మద్యం స్టాకు ఉందనే వివరాలు సంబంధిత లైసెన్సీలకు తప్ప ఎవరికీ తెలియదు. కొత్త ట్రాకింగ్‌ విధానంలో ప్రతి షాపు, బారుకు స్కానర్‌ ఇస్తారు. కచ్చితంగా స్కాన్‌ చేసిన తర్వాత మాత్రమే సీసాలను వినియోగదారులకు విక్రయించాలి. స్కాన్‌ చేసిన వెంటనే ఆ సమాచారం ఎక్సైజ్‌ డేటాబేస్‌కు చేరుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు డిజిటల్‌ పేమెంట్‌ చేస్తే ఆ సమాచారం కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. నగదు చెల్లింపు చేస్తే మాత్రం వెంటనే ఎక్సైజ్‌కు సమాచారం అందదు. డిజిటల్‌ చెల్లింపుల పాలసీలో భాగంగా షాపులు, బార్లలో అన్ని రకాల డిజిటల్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతారు. కార్డుల స్వైపింగ్‌, ఫోన్‌పే, గూగుల్‌పే, ఇతర డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యం ఏర్పాటు చేస్తారు. అలాగే వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న 30శాతం చెల్లింపులను కనీసం 60 శాతం చేయాలనే లక్ష్యంగా పాలసీని రూపొందిస్తున్నారు.


పారదర్శకత పెంపే లక్ష్యం

వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో చెల్లింపుల విధానంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నగదును పక్కదారి పట్టించడం కోసమే డిజిటల్‌ చెల్లింపులు లేకుండా చేశారని అప్పట్లో రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ప్రభుత్వ పర్యవేక్షణలో సాగిన మద్యం షాపుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా మద్యాన్ని విక్రయించి ఆ నగదు జేబుల్లో వేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులను శాశ్వతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మద్యం విక్రయాలు, ఆదాయంలో పాదర్శకతను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.

Updated Date - Mar 04 , 2026 | 03:42 AM