Share News

బ్రహ్మణిస్టీల్స్‌ భూములు వెనక్కి

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:36 AM

కడప జిల్లాను స్టీల్‌ సిటీగా మార్చేస్తామన్నారు. బ్రహ్మణి స్టీల్స్‌ అధినేత అయిన తన సన్నిహితుడు గాలి జనార్దన్‌రెడ్డికి నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పది వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారు.

బ్రహ్మణిస్టీల్స్‌ భూములు వెనక్కి

  • 18 ఏళ్లుగా 14 వేల ఎకరాలు నిరుపయోగం

  • వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్‌ ప్లాంట్‌

  • ఏర్పాటుకు 10,707 ఎకరాలు ధారాదత్తం

  • ప్లాంటు కట్టిందే లేదు.. 4 షెడ్లు వేశారు

  • నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల అప్పు

  • తర్వాత విమానాశ్రయం కడతానన్న గాలి

  • మరో 3,118 ఎకరాలిచ్చిన వైఎస్‌ ప్రభుత్వం

  • ఇక్కడా ఎలాంటి పనులూ చేయలేదు

  • 2013లోనే ప్లాంట్‌ భూముల స్వాధీనానికి ఉత్తర్వులు.. దీనిపై హైకోర్టుకు జనార్దన్‌రెడ్డి

  • గత నెలలో పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

  • దాంతో అన్ని భూములూ స్వాధీనం

డప జిల్లాను స్టీల్‌ సిటీగా మార్చేస్తామన్నారు. బ్రహ్మణి స్టీల్స్‌ అధినేత అయిన తన సన్నిహితుడు గాలి జనార్దన్‌రెడ్డికి నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పది వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. ఆయనేమో స్టీల్‌ ప్లాంట్‌ పనులే చేపట్టకుండా ఆ భూములను ఎంచక్కా బ్యాంకులో తనఖాపెట్టి వందల కోట్ల రుణం తెచ్చుకున్నారు. తర్వాత విమానాశ్రయం కూడా కడతామని 3 వేల ఎకరాలకుపైనే తీసుకున్నారు. ప్రహరీ నిర్మాణం తప్ప ఏమీ చేయలేదు. వైఎస్‌ మరణం తర్వాత బండారం బయటపడింది. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని 2013లోనే అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గాలి హైకోర్టుకు వెళ్లి ఇప్పటివరకు లాక్కొచ్చారు. ఆయన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో తాజాగా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

(కడప-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో బ్రహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని గాలి జనార్దన్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. పది మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల ఉక్కు పరిశ్రమను నిర్మించి.. వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయన అడిగిందే తడవుగా బ్రహ్మణి స్టీల్స్‌కు వైఎస్‌ 2007లో జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లె, కొత్తగుంటపల్లె, పి.బొమ్మేపల్లి, తుగ్గట్లపల్లిలో 10,707.53 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ.18 వేల చొప్పున కేటాయించారు.


బ్రహ్మణి స్టీల్స్‌ రూ.19.37 కోట్లు చెల్లించడంతో ఆ ఏడాది జూన్‌ 9న భూమిని దానికి బదలాయించేశారు. మర్నాడు అంబవరం వద్ద ప్లాంట్‌కు శంకుస్థాపన కూడా చేశారు. కానీ అక్కడ కట్టింది నాలుగు షెడ్లు మాత్రమే. అనంతరం విమానాశ్రయం కోసమంటూ గాలికి మరో 3,118 ఎకరాలు కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల కేవలం లబ్ధి పొందింది వైఎస్‌ కుటుంబం, గాలి జనార్దన్‌రెడ్డి అనేది జగద్విదితం. ఈ ప్రాజెక్టు మాటున జనార్దన్‌రెడ్డికి ఓబుళాపురం మైన్స్‌ కేటాయించారు. ఇక అడ్డూ అదుపు లేకుండా గాలి అండ్‌ కో రూ.వేల కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వి కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు తరలించారు. క్విడ్‌ ప్రొ కో జరగడంతో వైఎస్‌ కుటుంబీకులు కూడా లబ్ధి పొందారని చెబుతారు. బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10,707.53 ఎకరాలు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇచ్చిన 3,115.64 ఎకరాలు.. మొత్తం 13,823.17 ఎకరాలు. ఒకప్పుడు ఎకరా రూ.30 వేలు కూడా పలకని ఈ భూముల విలువ ఇప్పుడు రూ.30 లక్షలకు చేరింది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం వీటి మొత్తం విలువ సుమారు రూ.6 వేల కోట్లు.


నిబంధనలు తుంగలో తొక్కి..

బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయుంచిన భూములను నిబంధనల ప్రకారం గడువులోపు ఉపయోగించుకోవాలి. ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేయాలి. అయితే వైఎస్‌ అధికారాన్ని జనార్దన్‌రెడ్డి అడ్డుపెట్టుకుని.. కలెక్టర్‌ అనుమతి లేకుండానే ఆ భూములను యాక్సిస్‌ బ్యాంకులో తాకట్టుపెట్టి.. రూ.350 కోట్ల రుణం తీసుకున్నారు. అనంతరం వైఎస్‌ మరణం, ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ స్కాంలో జనార్దన్‌రెడ్డి చిక్కుకోవడంతో స్టీల్‌ ప్లాంట్‌ కథ ముగిసింది. అయితే ఈ భూముల కేటాయింపుపై నాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. దీనిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేయకపోగా.. ప్రభుత్వం ఇచ్చిన భూమిని తాకట్టుపెట్టి బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు తేల్చారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ భూమి స్వాధీనానికి 2013 జూన్‌ 20న ప్రభుత్వం జీవో 333 జారీచేసింది. బ్రహ్మణి స్టీల్స్‌తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. కేటాయించిన 10,707.53 ఎకరాలనూ స్వాధీనానికి సిద్ధమైంది. అయితే ఈ భూముల రద్దుపై బ్రహ్మణి స్టీల్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. రెండు పిటిషన్లు దాఖలుచేసింది. ప్రభుత్వం తరపున ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరు కాకపోవడంతో రెండు పిటిషన్లను హైకోర్టు గత నెల 25న డీఫాల్ట్‌గా కొట్టివేసింది. కేసును మూసివేసింది. దరిమిలా ఆ భూములను తాజాగా స్వాధీనం చేసుకున్నారు.


18 ఏళ్లలో ఎయిర్‌పోర్టు పనులూ లేవు..

కట్టని స్టీల్‌ ప్లాంట్‌ కోసం అప్పటి వైఎస్‌ ప్రభుత్వం.. గాలి జనార్దనరెడ్డి విమానాశ్రయం నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగానే.. జమ్మలమడుగు మండలంలో వివిధ సర్వే నంబర్లలో 3,115.64 ఎకరాలను ఎకరా రూ.25 వేలకు కేటాయించేసింది. బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ రూ.7.79 కోట్లు చెల్లించి వాటిని స్వాధీనం చేసుకుంది. 2008నాటికే విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పినా.. 18 ఏళ్లు గడిచినా ఎలాంటి పనులూ చేపట్టలేదు. దీనిపై 2019లో తనిఖీ చేసి పనులు జరగలేదని గుర్తించారు. ఈ ఏడాది మరోసారి అధికారులు పరిశీలించగా.. ఆ స్థలం చుట్టూ 5.87 కిమీ ప్రహరీ గోడ, ఓ చిన్న షెడ్డు నిర్మాణం తప్ప ఎలాంటి నిర్మాణాలూ లేవని తేలింది. ఒప్పందం మేరకు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎందుకు చేపట్టలేదని బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డికి హైదరాబాద్‌ అడ్ర్‌సకు నోటీసు పంపారు. ఆ భూముల వద్ద కూడా గోడకు నోటీసు అంటించారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో కలెక్టర్‌ శ్రీధర్‌ ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 03:38 AM