అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:14 AM
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని, సూపర్‌సిక్స్‌ని సూపర్‌హిట్ చేశామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు.
16 వేల టీచర్, 6 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ: డోలా
సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్: ఎమ్మెల్యేలు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని, సూపర్‌సిక్స్‌ని సూపర్‌హిట్ చేశామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు. గురువారం శాసనసభలో సూపర్ సిక్స్ పథకాలపై ఆయన మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెద్దమొత్తంలో పింఛన్లు ఇస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు రూ.5కే భోజనం పెడుతున్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చామన్నారు. పాఠశాలల బలోపేతం, తల్లికి వందనంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. స్త్రీశక్తిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల్లో చెప్పకపోయినా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్నదాత సుఖీభవతో ఏడాదికి రైతులకు రూ.20వేలు ఇస్తున్నామని, డీఎస్సీతో 16వేల ఉద్యోగాలు, 6వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వివరించారు. మొక్కవోని దీక్షతో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, గౌతు శిరీష, అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, తంగిరాల సౌమ్య, ప్రశాంతిరెడ్డి, ఈశ్వరరావు, నజీర్ అహ్మద్, పరిటాల సునీత ప్రసంగించారు.