చెత్తకుప్పల్లేని పట్టణాలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:03 AM
చెత్తకుప్పల్లేకుండా పట్టణాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో ఘన వ్యర్థాల పాత డంప్‌యార్డులను బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగించి..
డంప్ ఫ్రీగా మార్చేందుకు రెండు కమిటీలు ఏర్పాటు
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): చెత్తకుప్పల్లేకుండా పట్టణాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో ఘన వ్యర్థాల పాత డంప్‌యార్డులను బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగించి, పట్టణాలను డంప్‌ఫ్రీగా మార్చాలని మున్సిపల్‌శాఖ నిర్ణయించింది. పాత చెత్తకుప్పల నిర్మూలన పనులను వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనకు ఫీల్డ్ విజిట్ కమిటీ, సమన్వయం కోసం ఫీల్డ్ కోఆర్డినేషన్ కమిటీను ఏర్పాటు చేసింది. ఫీల్డ్ విజిట్ కమిటీలో పబ్లిక్‌హెల్త్ ఇంజనీర్ చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీ పాత డంప్‌యార్డులను పరిశీలించి టెండర్‌లో పేర్కొన్న పరిమాణంతో పోల్చి బయోమైనింగ్ పనుల పురోగతిని అంచనా వేస్తుంది. శుద్ధిచేసిన మట్టితో పాటు తొలగించాల్సిన వ్యర్థాల పరిమాణాన్ని గుర్తిస్తుంది. రోజువారీ ఉత్పత్తి అవుతున్న తాజా చెత్త పరిమాణాన్ని అంచనా వేసి ఆ పట్టణాన్ని డంప్ ఫ్రీగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళికతో పాటు కాలపట్టికను సమర్పిస్తుంది. ఇక ఫీల్డ్ కోఆర్డినేటషన్ కమిటీకి సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనలను సమన్వయం చేయడంతో పాటు, ఫీల్డ్ విజిట్ కమిటీ సమర్పించిన నివేదికలను పరిశీలించి, సాంకేతిక సూచనలు, అంచనా వ్యయాలు, అవసరమైన నిధులు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు సమర్పిస్తుంది.