సాగు కోసం స్పెషల్ డిస్కం
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:02 AM
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూడు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అదనంగా మరో పంపిణీ సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రత్యేకంగా...
ఏపీఆర్‌ఏపీఎల్.. వ్యవసాయ అవసరాలకు ప్రత్యేకం
పంపిణీ లైసెన్స్ కోసం ఈఆర్‌సీకి దరఖాస్తు
వ్యవసాయ కనెక్షన్ల నిర్వహణకే ఇది పరిమితం
ఇతర డిస్కంలలోని సాగు కనెక్షన్లన్నీ దీనికే బదిలీ
‘సెకీ’ విద్యుత్‌ను వినియోగదారులకు నేరుగా
సరఫరా చేసే బాధ్యతా అప్పగింత
400 మెగావాట్ల సౌర ప్రాజెక్టులకు పచ్చజెండా
475 మెగావాట్ల పవన ప్రాజెక్టులకూ..
270 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజికీ..
కోస్తా జిల్లాల్లో 200 మెగావాట్లతో
8 బయోమాస్ ప్లాంట్లకూ ప్రభుత్వం ఓకే
అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూడు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అదనంగా మరో పంపిణీ సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎల్) సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రప్రభుత్వం సోమవారం జీవో 31ని విడుదల చేసింది. అలాగే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పలు సౌర, పవన విద్యుత్, బయోమాస్ ప్రాజెక్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరాను మరింత సమర్థంగా నిర్వహించడానికి, సబ్సిడీ భారాన్ని పారదర్శకంగా ఉంచడానికే ప్రభుత్వం ఏపీఆర్‌ఏపీఎల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థ కేవలం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇతర డిస్కంల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లను ఈ సంస్థకు బదిలీ చేస్తారు. వ్యవసాయ రంగ విద్యుత్ కొనుగోలు పంపిణీ బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వ్యవసాయ రంగంలో విద్యుత్ పంపిణీకి అవసరమైన లైసెన్సును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నుంచి పొందే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర డిస్కంల పరిధిలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్ ఆస్తులను (లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు) దశలవారీగా ఏపీఆర్‌ఏపీఎల్‌కు బదలీ చేయనున్నారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా పొందే సౌర విద్యుత్‌ను రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు నేరుగా సరఫరా చేసే బాధ్యతనూ ఏపీఆర్‌ఏపీఎల్ చేపడుతుంది. సెకీ నుంచి సేకరించే 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి అనుగుణంగా.. వ్యవసాయ ఫీడర్ల బదిలీ ప్రక్రియను పర్యవేక్షించే అధికారాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కట్టబెట్టారు. ఏపీఆర్‌ఏపీఎల్ ఏర్పాటుతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా మరింత పటిష్ఠం కానుంది.
క్లీన్ ఎనర్జీలో అనుమతించిన తాజా ప్రాజెక్టులు..
కర్నూలు జిల్లా ఆలూరు, తదితర గ్రామాల్లో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్సార్ రెన్యువబుల్స్ సోలార్ లిమిటెడ్‌కు అనుమతి. దీంతోపాటు 220 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం.
శ్రీసత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంటలో 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్, 50 మెగావాట్ బీఈఎస్ఎస్ ప్రాజెక్టు.. పేస్ డిజిటెక్ లిమిటెడ్‌కు అనుమతి.
అనంతపురం జిల్లా పొట్టిపాడు, వజ్రకరూర్ గ్రామాల్లో 175 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్టు.. ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్-1 లిమిటెడ్‌కు అనుమతి.
కడప జిల్లా పులివెందుల మండలం లింగాల తదితర గ్రామాల్లో 150 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్టు.. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్-7 ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి.
కడప జిల్లా సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని గ్రామాల్లో, అనంతపురం జిల్లా యల్లనూర్ మండలంలో మరో 150 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు.. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్-6 ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ (ఒక కిలో టన్స్ పర్ యానమ్-కేటీపీఏ సామర్థ్యం).. హెచ్‌హెచ్‌పీ-8 ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి.
వరి ఎక్కువగా పండించే తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 25 మెగావాట్ల సామర్థ్యం గల 8 బయోమాస్ ప్లాంట్ల (మొత్తం 200 మెగావాట్లు) ఏర్పాటుకు ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్‌కు అనుమతి.