సర్కారు బడికెళ్దాం!
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:30 AM
సర్కారు బడుల్లో పిల్లల నమోదును పెంచడం కోసం ప్రభుత్వం ఎంత ప్రచారం కల్పిస్తుందో, ఉపాధ్యాయులు కూడా అదే స్ఫూర్తితో శ్రమిస్తున్నారు.
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు..
ఒకే స్కూల్లో 85 మంది విద్యార్థుల చేరిక
పూలు చల్లి మేళతాళాలతో టీచర్ల ఘన స్వాగతం
బడిలో చేరితే సొంత డబ్బుతో సైకిళ్లు.. ఓ హెచ్‌ఎం బంపర్ ఆఫర్
ఈ ఏడాదీ సీట్లు ఖాళీ లేవు.. బోడపాడులో నో అడ్మిషన్ బోర్డు
‘సర్కారు వారి పాఠం’ చక్కగా వినిపిస్తోంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులనూ ‘రారమ్మని’ పిలుస్తోంది. కొత్తగా ఉపాధ్యాయుల నియామకం, వసతుల పెంపు ఫలితాలను ఇస్తోంది. ‘ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య. పుస్తకాలు ఉచితం. మధ్యాహ్న భోజనం! ఇంకా మరెన్నో సౌలభ్యాలు’ అంటూ ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారం ప్రభావం చూపుతోంది. దీనికి నిదర్శనమైన 3 ఘటనల వివరాలు..
చీపురుపల్లి, మార్కాపురం రూరల్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): సర్కారు బడుల్లో పిల్లల నమోదును పెంచడం కోసం ప్రభుత్వం ఎంత ప్రచారం కల్పిస్తుందో, ఉపాధ్యాయులు కూడా అదే స్ఫూర్తితో శ్రమిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురం యూపీ పాఠశాల హెచ్‌ఎం గొర్లె పద్మావతి.. ప్రభుత్వ బడిలో చేరిన వారికి తన సొంత డబ్బులతో బహుమతులిస్తామని ప్రకటించారు. పాఠశాలలో ఐదోతరగతి పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా అదే స్కూల్లో ఆరో తరగతిలో చేరిన ముగ్గురు విద్యార్థులకు హెచ్‌ఎం పద్మావతి రూ.16,500 విలువ చేసే మూడు కొత్త సైకిళ్లను కొనుగోలు చేసి బుధవారం పంపిణీచేశారు. ఇలా ఎంత మంది చేరినా సైకిళ్లు ఇస్తానని ఆమె ప్రకటించడం విశేషం. అలాగే, మిగిలిన తరగతుల్లో చేరిన వారికి స్టీలు కంచాలు పంపిణీ చేశారు.

ఈ ఏడాదీ సీట్లు ఖాళీ ల్లేవు!.. మార్కాపురం మండలంలోని బోడపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 161 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు జాకబ్ తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 65 అడ్మిషన్‌లు రాగా, వారిలో 60మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారు కావడం విశేషం. దీంతో సీట్లు ఫుల్ అవడంతో బుధవారం నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. గత ఏడాది కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు అందుకున్నారు.
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..
రాజాం రూరల్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): పదోతరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడంతో ప్రభుత్వ బడులకు విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో మండలంలోని పలు ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలల్లో చదువుతున్న 85 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు. వీరంతా బుధవారం ఒకేసారి పాఠశాలకు రావడంతో పాఠశాల ఉపాధ్యాయులు బ్యాండు మేళం ఏర్పాటు చేసి.. విద్యార్థులపై పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. చదువుపై భయం పోగొట్టి ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకాన్ని కలిగించేందుకు ఈ ఏర్పాట్లు చేశామని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.