Share News

అదేం తప్పు కాదు!

ABN , Publish Date - May 07 , 2026 | 04:02 AM

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతోపాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధించడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. పిల్లలను ప్రధా న స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని..

అదేం తప్పు కాదు!

  • తెలుగుతోపాటు ఆంగ్లమూ బోధించవచ్చు

  • పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే యత్నమది

  • ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు లభించవు

  • విద్యాశాఖ ప్రొసీడింగ్స్‌లోని తప్పును ప్రభుత్వం సవరించినందున పిల్‌ నిరర్ధకం : హైకోర్టు

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతోపాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధించడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. పిల్లలను ప్రధా న స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అందిస్తోందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే, సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఆంగ్లమే బోధనా భాషగా ఉండాలంటూ గత నెల 16న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ జారీ చేసిన మెమోను సవరణ చేశామని, పాఠ్యపుస్తకాలు ద్విభాషల్లో రూపొందించామని, విదార్థులు తమకు నచ్చిన భాషలో చదువుకునే అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ చెప్పిన వివరాలను ధర్మాసనం నమోదు చేసింది. తెలుగు, ఆంగ్ల భాషల్లో విద్యా బోధన ఉంటుందని విద్యాశాఖ చెబుతున్న నేపఽథ్యంలో పిల్‌ను నిరర్ధకమైనదిగా ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరపాలని పేర్కొనడాన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలంటూ కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకి కి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.


ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి.వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో మాత్రమే బోధన జరగాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పునకువిరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఆంగ్లమే బోధనా భాషగా ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 16న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు’’ అని తెలిపారు. విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపించారు. ‘‘పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో తప్పు దొర్లింది. ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ఉందని చెప్పడం ద్వారా విద్యార్థులను ఆకర్షించాలన్నదే పాఠశాల విద్యాశాఖ అధికారుల ఉద్దేశం. ఆ ప్రొసీడింగ్స్‌కు సవరణ చేస్తూ మే6న ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ద్విభాషా విధానమే అమల్లో ఉంటుంది. ఒకే పుస్తకంలో ఇంగ్లిష్‌, తెలుగు ముద్రిస్తారు.’’ అని వివరించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో వివాదాస్పద వాక్యాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేసింది. పాఠ్య పుస్తకాలు ద్విభాషల్లో ఉన్న కారణంగా పిటిషనర్‌ అభ్యంతరం పరిష్కారం అయినట్లు ప్రకటించింది.

Updated Date - May 07 , 2026 | 04:02 AM