Share News

ప్రతి తరగతికీ ఒక గది!

ABN , Publish Date - May 28 , 2026 | 05:28 AM

ప్రతి తరగతికి ఒక టీచర్‌ పేరుతో గతేడాది ప్రవేశపెట్టిన మోడల్‌ ప్రైమరీ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ప్రతి తరగతికీ ఒక గది!

  • 9,554 గదుల్లో తాత్కాలిక గోడలు అవసరం

  • 5,989 బడుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి

  • రూ.571కోట్లు మంజూరు: ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రతి తరగతికి ఒక టీచర్‌ పేరుతో గతేడాది ప్రవేశపెట్టిన మోడల్‌ ప్రైమరీ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి తరగతికి ప్రత్యేకంగా ఒక గది ఉండాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 9,620 మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 38,801 తరగతి గదులు ఉండగా, మరో 981 గదులు నిర్మించనున్నారు. శాశ్వత ప్రతిపదికన కాకపోయినా ఒకే గదిలో 9,554 పార్టిషన్లు (తాత్కాలిక గోడల ఏర్పాటు) అవసరమని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది. అలాగే పాఠశాలల్లో పది ప్రధాన కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. 9,620 మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో 5,989 బడుల్లో కనీస సదుపాయాలు అవసరమని అంచనా వేసింది. దీనికోసం రూ.571.11 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరుచేస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1,914 పాఠశాలల్లో మేజర్‌ అండ్‌ మైనర్‌ మరమ్మతులకు రూ.55.56 కోట్లు, 3,171 పాఠశాలల్లో వరండాలను తరగతి గదులుగా మార్చేందుకు రూ.44.69 కోట్లు, 2,569 పాఠశాలల్లో ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటుకు రూ.21.06 కోట్లు, 2,050 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.64.72 కోట్లు, 1,585 పాఠశాలల్లో పార్టిషన్లకు రూ.22.07 కోట్లు, 3,327 బడుల్లో రంగుల కోసం రూ.72.56 కోట్లు, 3,161 బడుల్లో తాగునీటికి రూ.64.22కోట్లు, 3,371 బడుల్లో గ్రీన్‌ చాక్‌ బోర్డులకు రూ.19.56 కోట్లు, 2,808 బడుల్లో డ్యూయెల్‌ డెస్క్‌లకు రూ.62.95 కోట్లు, 457 బడుల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.143.72 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ప్రాథమిక అంచనాలు రూపొందించి నిధుల విడుదలకు అనుమతులు మంజూరు చేయగా ఇప్పుడు సవివరమైన అవసరాల అంచనా కోసం కమిటీల నియామకానికి స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మండల, జిల్లా స్థాయిలో ఈ కమిటీలను నియమించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రాథమిక అంచనాల ప్రకారం తాగునీటికి ఆర్వో సిస్టమ్‌, డ్యూయెల్‌ డెస్క్‌లు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు ఇతర అవసరాలపై సవివరమైన అంచనాలను ఈ కమిటీలు తయారుచేస్తాయి. తాజాగా మంజూరు చేసిన నిధులను ఆ పనులకు ఉపయోగిస్తారు.


తరగతి గదులు ఇలా...

మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన ఉంది. అయితే కొన్నిచోట్ల 45 మంది ఉన్నా మోడల్‌ ప్రైమరీ పాఠశాలగా గుర్తించారు. అయితే వాటిల్లోనూ కనీసం 60 మంది ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. 60 నుంచి 90 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో మొత్తం 5 తరగతి గదులు ఉండాలి. సగటున 18 మందికి ఒక గది ఉంటుంది. 91 నుంచి 120 మంది విద్యార్థులుంటే సగటున 24 మందికి ఒక గది, 121 నుంచి 150 మంది విద్యార్థులుంటే సగటున ప్రతి 30 మందికి ఒక గది ఉండాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 150 మంది దాటితే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక అదనపు తరగతి గది నిర్మించేందుకు చర్యలు ప్రారంభించింది.

Updated Date - May 28 , 2026 | 05:28 AM