రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ ‘సంజీవని’
ABN , Publish Date - May 19 , 2026 | 05:29 AM
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
తొలి ఏడాది రూ.149 కోట్లతో నిర్వహణ
రెండో ఏడాదికి రూ.55.5 కోట్ల అంచనా
15 మంది సభ్యులతో ఫార్మసీ కౌన్సిల్
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటిగ్రేటేడ్ డిజిటల్ కేర్ కో-ఆర్డినేషన్, హెల్త్ కేర్ డెలవరీ సిస్టమ్ పేరుతో దీనిని అమలుల్లోకి తీసుకురానున్నారు. ప్రాజెక్టు అమలుకు తొలి ఏడాది రూ.149 కోట్లు ఖర్చు అవుతుందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. తొలి ఏడాది ఖర్చులో ఎక్కువ భాగం రూ.90 కోట్లను నేషనల్ హెల్త్ మిషన్ నుంచి తీసుకోనున్నారు. మిగిలిన రూ.59 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించనున్నారు. రెండో ఏడాది రూ55.5 కోట్లు ఖర్చు అవుతుందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. దీనిలో రూ.45.5 కోట్లను నేషనల్ హెల్త్ మిషన్ నుంచి, మిగిలిన రూ.10 కోట్లు రాష్ట్ర వాటా కింద కేటాయించనున్నారు. సంజీవనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఆర్‌ఎఫ్‌పీ ఆమోదించిన తర్వాత టెండర్లకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యశాఖ కమిషనర్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఔషధ మండలి ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 15 మంది సభ్యులతో కూడిన ఔషధ మండలి(పార్మసీ కౌన్సిల్)ని ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన ఫార్మసీ ఎన్నికల్లో డి.ఎన్.ఆర్.పి. రెడ్డి, ఎన్. విజయభాస్కర్, డి. నరేంద్ర, పి. రాంబాబు, టి. సుబ్బరామగుప్తా, వి.ఎస్. కల్యాణచక్రవర్తి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్.ఎల్.ఎన్. ప్రసాద్‌రెడ్డి, ఎస్. కుసుమకుమారి, కె. రవీంద్రరెడ్డి, జి. దుర్గాప్రసాద్, పి. సౌజన్యాలను నామినేట్ చేసింది. వీరితోపాటు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డి. శ్రీహరి, డీఎంఈ, డీజీ డ్రగ్స్, డ్రగ్స్ విభాగంలోని సీనియర్ అనలిస్టులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌ను వీరు ఎన్నుకోనున్నారు.
జీవోలో పొరపాటు
ఫార్మసీ కౌన్సిల్ కోసం ఆరోగ్య శాఖ విడుదల చేసిన జీవోలో పొరపాటు దొర్లింది. డాక్టర్ డి. శ్రీహరిని ఫార్మసీ కౌన్సిల్ మెంబర్‌గా నియమించిన ప్రభుత్వం.. ఆయనను ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా పేర్కొంది. కానీ, ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిల్‌కు చైర్మన్ ఎన్నిక జరగలేదు. జీవోకు సవరణ చేయాలని పలువురు కోరుతున్నారు.