ధరలకు కళ్లెం వేద్దాం!
ABN , Publish Date - May 30 , 2026 | 05:25 AM
ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
నిత్యావసరాల ధరలపై నిరంతర సమీక్ష
ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల సమన్వయం
ధరల స్థిరీకరణపై మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయాలు
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదల తీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ధరల స్థిరీకరణపై మంత్రుల కమిటీ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్‌లో పప్పులు, బియ్యం, వంట నూనెలు, టమాటా, ఉల్లి తదితర నిత్యావసర సరుకులకు ఉన్న డిమాండ్, రిటైల్, హోల్‌సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై మంత్రులు సమీక్షించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా.. వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని నాదెండ్ల తెలిపారు. ముఖ్యంగా వంట నూనెల ధరలు దేశవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే 3నెలల్లో ధరలను అదుపులో ఉంచేందుకు అవసరమైన ముం దస్తు చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చామన్నారు.
ఖరీఫ్‌కు ముందస్తు ప్రణాళికలు: అచ్చెన్న
వచ్చే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ప్రాధాన్యత కలిగిన వరి వంగడాలను సాగు చేసేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.