పేదల స్థలాలకు మళ్లీ క్రమబద్ధీకరణ
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:41 AM
అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో అమలు
డిసెంబరు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 డిసెంబరుతో ఈ స్కీమ్ గడువు ముగిసిపోయింది. కొత్త ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరారు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ స్కీమ్‌ను మరోసారి అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయుప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నం.115) జారీ చేశారు. గత ఏడాది ఇంటి స్థలాల క్రమబద్ధీకరణను జీవో నం.30 ద్వారా ఏడాదిపాటు అమలు చేశారు. అయితే, చాలామంది పేదలు దరఖాస్తు చేసుకోలేదు. స్కీమ్‌పై సరైన అవగాహన లేకపోవడం, ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పల్లా శ్రీనివాసరావు కోరగా, రెవె న్యూశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, ఇంకా పూరిపాకలు, తాత్కాలిక షెడ్‌లు వేసుకుని నివసిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చెరువులు, కుంటలు, కాలువ, చెరువు పోరంబోకు, డిఫెన్స్, ఇతర కీలకమైన ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని పక్షంలోనే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఈ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ఆదేశించింది.
గాజువాకలో వెయ్యి చ.గజాలు క్రమబద్ధీకరణ
భూముల క్రమబద్ధీకరణలో విశాఖ జిల్లా గాజువాకకు మరో స్కీమ్‌ను ప్రభుత్వం పునరుద్ధరించింది. గాజువాక గ్రామ పరిధిలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే వెయ్యి చదరపు గజాల వర కు క్రమబద్ధీకరణకు అనుమతించనున్నారు. 2025 డిసెంబరులో ఈ స్కీమ్ గడువు ముగిసింది. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు ఈ స్కీమ్ ఈ ఏడాది కూడా అమలు చేయాలని రెవెన్యూశాఖ ఉత్తర్వులు (జీవోనం. 114)జారీ చేసింది. క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఈ ఏడాది జూన్ 30 వరకు స్వీకరించాలని తాజా గడువును నిర్దేశించింది. జీవో నం. 45 ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపింది.