గ్రామీణ పేదల ఇళ్ల ‘ధర’ పెంపు
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:45 AM
ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
రూ.1.20 లక్షల నుంచి 2.39 లక్షలకు
ఆ మొత్తం రాయితీగా లబ్ధిదారుల ఖాతాకు
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై-రూరల్) 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్ ధరను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. పీఎంఏవో గ్రామీణ్ 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్లకు కేంద్ర వాటా రాయితీ కింద రూ.72 వేలు(60 శాతం), రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ రూ.48 వేలు(40 శాతం)... కలిపి మొత్తం రూ.1.20 లక్షలు, జీ రామ్ జీ కింద 90 రోజుల పని దినాలకు కన్వర్జెన్స్ రూపంలో రూ.27వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద రూ.12 వేలు, ఎస్‌హెచ్‌జీ లోన్‌పై వడ్డీ రాయితీ రూ.80 వేలు కలిపి... మొత్తం రూ.2.39 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.