AP Government: టీటీడీ దూకుడుకు బ్రేక్
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:53 AM
అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న టీటీడీ పాలక మండలికి ప్రభుత్వం చెక్ పెట్టింది. పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి తిరుమలలో వసతి గృహ నిర్మాణానికి...
జంగాకు కొండపై భూమి ఇవ్వబోం
క్యాబినెట్‌లో సీఎం చంద్రబాబు సృష్టీకరణ
టీటీడీలో అందరికీ ఒకే రూల్ ఉండాలి
ఇష్టానుసారం తీర్మానాలొద్దన్న పవన్
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న టీటీడీ పాలక మండలికి ప్రభుత్వం చెక్ పెట్టింది. పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి తిరుమలలో వసతి గృహ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్న బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ భూ కేటాయింపులపై ముందుకు వెళ్లబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బుధవారం ఆంధ్రజ్యోతి ‘ఏడు కొండలపై ఏమిటిది’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి దాని వెనుక ఉన్న వ్యవహారాలపై సీఎంకు నివేదించింది. గురువారం క్యాబినెట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారు. ‘‘రూల్ అందరికీ ఒకేలా ఉండాలి. టీటీడీలో బోర్డు మెంబర్‌కు ఒకలా.. బయటి వ్యక్తులకు మరోలా ఉండకూడదు. టీటీడీ అనేది ధర్మాన్ని కాపాడే సంస్థ. అది ధర్మం ప్రకారమే పని చేయాలి. ధర్మాన్ని పరిరక్షించాలి. టీటీడీలో ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా పని చేయాలి’’ అని పవన్ అన్నారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు.. ‘‘అవును అది ధర్మాన్ని కాపాడే సంస్థ. వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు తావు ఉండకూడదు. ప్రతిదీ ధర్మబద్ధంగానే ఉండాలి.
వివరాల పూర్తిగా తెప్పించుకుని పరిశీలిస్తాను. జంగాకు స్థలం ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద వాళ్లే కొండ మీద స్థలం కావలని అడగరు. మనం కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం. వాటిని అతిక్రమిస్తామంటే సహించలేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో స్థలం ఇవ్వం’’ అని సృష్టం చేశారు. రెండుసార్లు కాదన్నది.. మళ్లీ ఇప్పుడు టీటీడీ పాలక మండలి సమావేశం ముందుకు ఎలా వచ్చిందన్నది సర్వత్రా చర్చకు దారి తీసింది. దీని వెనుక బారీ డీల్ ఉందని టీటీడీ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఊరూపేరూ లేని ఒక ట్రస్ట్‌కు కొండ మీద స్థలం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఈ ట్రస్ట్‌ను కేవలం తిరుమలలో స్థలం పొందేందుకు ఏర్పాటు చేశారని, జంగా మధ్యవర్తిగా తనదేనని క్లైమ్ చేస్తున్నారని, వాస్తవానికి ఈ ట్రస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందినదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
నివేదిక కోరిన సీఎంవో...
టీటీడీ బోర్డు జంగాకు భూ కేటాయింపు చేయడం వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై సీఎంవో ఆరా తీసింది. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో దీనిపై కథనం ప్రచురితం కావడంతో సీఎం కార్యాలయం రంగంలోకి దిగింది. సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ, టీటీడీని ఆదేశించారు. మరోవైపు ఈ స్థలం కేటాయింపు వ్యవహారాన్ని బోర్డులో వ్యతిరేకించిన బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డితో కూడా అధికారులు మాట్లాడారు.