రెండేళ్ల పాలనపై.. కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు!
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:19 AM
ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26‘ పేరుతో నివేదికలు విడుదల చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.
నేటి నుంచి కీలకాంశాలపై చర్యల నివేదికలు
మొత్తం 10 అంశాలపై రిపోర్టులు సిద్ధం
నేడు విద్యుత్‌పై నివేదిక విడుదల
జూలై 18కల్లా మొత్తం రిపోర్టులు పెట్టాలి
తర్వాత పుస్తక రూపంలోనూ తేవాలి: సీఎం
అమరావతి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26‘ పేరుతో నివేదికలు విడుదల చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై చర్యల నివేదికల మాదిరిగా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని స్పష్టంచేశారు. వాటితోపాటు మరో 3 ముఖ్యమైన అంశాలు.. మొత్తం పదింటిపై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిపై మంత్రులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించారు. రెండేళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లింది... రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది.. వం టి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరచాలని సూచించారు. తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టా మో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టడమే ప్రోగ్రె స్ రిపోర్టుల ఉద్దేశమన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకం అంశాలతో ‘డెవల్‌పమెంట్‘ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో ‘గుడ్ గవర్నెన్స్’ ప్రోగెస్ రిపోర్ట్... సంక్షేమం, పీ-4వంటి వాటితో ‘వెల్ఫేర్-ఎంపవర్‌మెంట్‘ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆర్థికంపై ప్రోగ్రెస్ రిపోర్టును ఈసారి విడుదల చేయనున్నారు. 6 నివేదికలను మంత్రులు విడుదల చేసిన తర్వాత.. మిగిలిన 4 రిపోర్టులను ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముందుగా సోమవారం విద్యుత్ రంగంపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తారు.