Share News

పే అండ్‌ యూజ్‌!

ABN , Publish Date - Jun 01 , 2026 | 06:09 AM

ప్రభుత్వ విద్యుత్తు సర్వీసులకు ప్రీపెయిడ్‌ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు..

పే అండ్‌ యూజ్‌!

  • ప్రభుత్వ విద్యుత్తు సర్వీసులకు నేటి నుంచి ప్రీపెయిడ్‌

  • కరెంటు వినియోగం, బిల్లింగ్‌ అంశాల్లో పారదర్శకత

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యుత్తు సర్వీసులకు ప్రీపెయిడ్‌ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ వర్క్స్‌, వీధి దీపాలు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విద్యుత్తు సర్వీసుల విద్యుత్తు వినియోగం, బిల్లింగ్‌ అంశాల్లో పారదర్శకతను పెంపొందించేందుకు వీలుగా స్మార్ట్‌ మీటర్లను ప్రీపెయిడ్‌ మీటర్లుగా మార్చారు. ప్రభుత్వ విద్యుత్తు సర్వీసుల బకాయిల సమస్య నుంచి బయటపడేందుకు ఈ నూతన విధానం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రీపెయిడ్‌ మీటరింగ్‌ ద్వారా విద్యుత్తు వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకునేందుకు, విద్యుత్తు పొదుపు, బిల్లును ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రీపెయిడ్‌ మీటర్లతో వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. ఈ విధానంలో ప్రభుత్వ సర్వీసులన్నింటినీ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఈ వాలెట్‌ ద్వారా రీచార్జి ప్రక్రియను చేపడతారు. ప్రీపెయిడ్‌ విధానాన్ని అమలు చేయడంలో సీపీడీసీఎల్‌ ముందంజలో ఉంది. మొత్తం 71,174 ప్రభుత్వ సర్వీసులు ఉండగా, వాటిలో సుమారు 50 వేల సర్వీసులు సోమవారం నుంచి ప్రీపెయిడ్‌లోకి మారనున్నాయి. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 1.17 లక్షల వరకు ప్రభుత్వ సర్వీసులు ఉండగా, 34,496 సర్వీసులను ప్రీపెయిడ్‌లో మార్చారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో సుమారు 2 లక్షల పైచిలుకు ప్రభుత్వ సర్వీసులు ఉండగా, నాలుగోవంతు మాత్రమే ప్రీపెయిడ్‌లోకి మార్చారు.

Updated Date - Jun 01 , 2026 | 06:10 AM