Share News

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:43 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • ఆర్థిక ఇబ్బందులున్నా 1నే జీతాలు ఇస్తున్నాం

  • ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం

  • ఈహెచ్‌ఎ్‌సను అప్‌డేట్‌ చేస్తున్నాం

  • ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలో మంత్రులు కేశవ్‌, సత్యకుమార్‌

  • పీఆర్సీ కమిషనర్‌ను నియమించండి: ఏపీ జేఏసీ అమరావతి

విజయవాడ సిటీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (ఏపీ జేఏసీ అమరావతి) 4వ రాష్ట్ర మహాసభ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగింది. తొలుత జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌ ఆధ్వర్యంలోవేలాది మంది ఉద్యోగులు లెనిన్‌ సెంటర్‌ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు మంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఉద్యోగులు కష్టపడి దాచుకున్న డబ్బును గత వైసీపీ ప్రభుత్వం మింగేసిందని ఆర్ధిక మంత్రి కేశవ్‌ అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు నిరంతరం చర్చలు జరుగుతున్నాయన్నారు. కాస్త ఆలస్యమైనా.. ఉద్యోగుల సంక్షేమం కోసం చేయగలినంత చేస్తామని భరోసా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలతతో ఉందన్నారు. స్ర్తీ పథకం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈహెచ్‌ఎ్‌సను అప్‌డేట్‌ చేసి ఉద్యోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 18 నెలల్లో జరిగే క్లయిమ్‌లను మూడు నెలలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

బకాయిలన్నీ క్లియర్‌ చేయండి

సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పలు డిమాండ్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించి వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని, డీఏ ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలని, దీనిలో తొలి ప్రాధాన్యత పెన్షనర్లకు ఇవ్వాలని, 11వ పీఆర్సీ ఎరియర్స్‌ను ఆలస్యం లేకుండా విడుదల చేయాలన్నారు. జీపీఎఫ్‌ మొత్తాల నుంచి పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, సరెండర్‌ లీవ్‌ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలన్నారు. జేఏసీ తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Updated Date - Feb 06 , 2026 | 03:43 AM