Share News

రాష్ట్రంలో నెలకు రెండు హోటళ్లు ప్రారంభించేలా ప్రణాళిక

ABN , Publish Date - May 14 , 2026 | 04:58 AM

కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతి, విశాఖ నగరాలను ఐకానిక్‌ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నామని, అందుకోసం ఒక్కో...

రాష్ట్రంలో నెలకు రెండు హోటళ్లు ప్రారంభించేలా ప్రణాళిక

  • నాలుగు జిల్లాల అధికారులతో మంత్రి దుర్గేశ్‌ సమీక్ష

తిరుపతి(కలెక్టరేట్‌), మే 13(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతి, విశాఖ నగరాలను ఐకానిక్‌ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నామని, అందుకోసం ఒక్కో కేంద్రానికి రూ.500 కోట్లు చొప్పున రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో 2029 నాటికి రాష్ట్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్‌ గదులు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి నెలా రెండు కొత్త హోటళ్లు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో టూరిజం అభివృద్ధిపై మంత్రి తిరుపతిలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇన్వెస్టర్లకు అవసరమైన భూములను కేటాయించడం... ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. తిరుపతికి వచ్చే యాత్రికులు దర్శనాలకే పరిమితం కాకుండా రెండు మూడు రోజులు బస చేసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరుస్తామని తెలిపారు. గడచిన 24 నెలల కాలంలో పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు. విశాలమైన సముద్ర తీరం ఉన్న నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ స్థాయి స్టార్‌ హోటళ్లు, రిసార్టులు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. మైపాడు బీచ్‌ ఫెస్టివల్‌ను జూలైలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. అంతకుముందు తిరుచానూరు సమీపంలో హోటల్‌ రిజెంటా దేవరాయ హోటల్‌ను మంత్రి ప్రారంభించారు.

Updated Date - May 14 , 2026 | 04:58 AM