రేషన్‌లో నాణ్యమైన బియ్యం!
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:02 AM
‘కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదు. అందుకే భవిష్యత్తులో..
ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా సానుకూలం
రాష్ట్రంలో త్వరలో 1000 మినీ మార్టుల ఏర్పాటు
పుదుచ్చేరి, ఛండీఘడ్ తరహాలో సీబీడీసీ విధానం
పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ‘కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదు. అందుకే భవిష్యత్తులో చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రతిపాదనపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే.. ప్రజలు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడమే సరైన విధానంగా భావిస్తున్నామని చెప్పారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యంతోపాటు పంచదార, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన మిల్లెట్స్, పామాయిల్, రాగి, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను రాయితీపై తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని ఎన్‌సీసీఎఫ్‌తో భాగస్వామ్యం చేసుకుని, రాష్ట్రంలో హోల్‌సేల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లకు ధీటుగా 1,000 మినీ మార్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రం సంస్కరణల్లో భాగంగా రేషన్ లబ్ధిదారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చడానికి ఛండీఘఢ్, పుదుచ్చేరిల తరహాలో సీబీడీసీ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని అమలు చేసి.. తర్వాత రాష్ట్రమంతటా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
సీఎంఆర్, ఈకేవైసీల్లో ఏపీ టాప్
మధ్యాహ్న భోజన పథకానికి సూపర్ ఫైన్ రైస్‌ను సరఫరా చేస్తున్నామని నాదెండ్ల తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్ రైస్‌ను తీసుకొచ్చేందుకు నిపుణులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఇప్పటికే క్యూఆర్ కోడ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్రం నుంచి ప్రశంసలు అందుకున్నామని తెలిపారు. సీఎంఆర్ డెలివరీస్‌లో కూడా మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఈకేవైసీ ప్రక్రియను 99.06 శాతం పూర్తి చేసిన రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనని చెప్పారు.
ధాన్యం కొనుగోల్లో రికార్డు
ఈ ఏడాది 17.97 లక్షల మంది రైతుల నుంచి 1.29 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. 94 శాతం మంది రైతులకు 24 గంటల్లోనే సొమ్ములు చెల్లించి రికార్డు సృష్టించామని మంత్రి తెలిపారు. 44 వేల మంది రైతులు వాట్సాప్ ద్వారానే 3.51 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు రూ.50 కోట్లతో టార్పాలిన్లు కొనుగోలు చేసి కౌలు, చిన్న రైతులకు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో సవిల్ సప్లయిస్ కమిషనర్ కన్నబాబు, పౌరసరఫరాల సంస్థ ఎండీ డిల్లీరావు పాల్గొన్నారు.