Share News

పేదలందరికీ ఇళ్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:27 AM

రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన నిరుపేదలందరికీ శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు సమకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు.

పేదలందరికీ ఇళ్లు

  • 2029 నాటికి 7.50 లక్షల మందికి అందజేత

  • మరో 2.50 లక్షల మందికి స్థలాల కేటాయింపు

  • జూన్‌ నాటికి లబ్ధిదారులకు 2.61 లక్షల ఇళ్లు

  • హడ్కో నుంచి ఏపీ టిడ్కోకు

  • రూ.4,451 కోట్ల రుణ గ్యారంటీకి ఆమోదం

  • అమరావతిలో వీధి పోటున్న 112 ప్లాట్లు రద్దు

  • లాటరీ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు

  • రాజధానిలో అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరు

  • టీటీడీలో పలు పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు అనుమతి

  • క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన నిరుపేదలందరికీ శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు సమకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్లను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించిన వివిధ అంశాలను మంత్రి మీడియాకు వివరించారు. ‘‘రాష్ట్రంలో ఇళ్లు, స్థలాల కోసం దాదాపు 10లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7.50 లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా. వీరందరికీ 2029 నాటికి శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలని, మిగిలిన 2.50 లక్షల మందికి స్థలాలు కేటాయించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది’’ అని మంత్రి పేర్కొన్నారు.


  • క్యాబినెట్‌ ఆమోదించిన మరికొన్ని నిర్ణయాలు..

  • పీఎంఏవై(అర్బన్‌) 1.0 కింద రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ యూనిట్లు, మౌలిక సదుపాయాలకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం పొందేందుకు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ జారీ చేసిన జీవోను క్యాబినెట్‌ ఆమోదించింది.

  • పలమనేరులో ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన 33 ఎకరాల భూమిని అక్కడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(కొత్త యార్డు)కి బదిలీ చేయడానికి ఆమోదం. ప్రస్తుత యార్డును రైతుబజార్ల సొసైటీకి అప్పగించి, ఆధునిక రైతుబజార్‌ అభివృద్ధి చేయాలని నిర్ణయం.

  • పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి అదనపు సిబ్బంది కేటాయింపునకు ఆమోదం. పిడుగురాళ్లలోని 330 పడకల ఆస్పత్రిని 420 పడకల బోధనాస్పత్రిగా ప్రభుత్వం మార్పు చేసింది. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 300మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆ సంఖ్యను 600కు పెంచింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవోను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలకు మంజూరు చేసిన పోస్టులు తిరిగి కేటాయించాలని నిర్ణయించారు.

  • గుంటూరులోని శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్‌ అభివృద్ధికి 1.47 ఎకరాలు కేటాయింపు. తిరుపతి శిల్పారామాన్ని కన్వెన్షన్‌ సెంటర్‌గా, విశాఖలో బొటీక్‌ హోటల్‌ అభివృద్ధికి జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ రద్దుకు ఆమోదం.

  • రాజధాని అమరావతిలో వీధి పోటుతో అభ్యంతరాలున్న 112 రిటర్నబుల్‌ ప్లాట్ల ను రద్దు చేసి, లాటరీ ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించే అధికారం సీఆర్‌డీఏకు ఇస్తూ నిర్ణయం. సదరు ప్లాటు థర్డ్‌ పార్టీకి బదిలీ కాలేదనే షరతుకు లోబడి ఈ అవకాశం కల్పిస్తారు.

  • రాజధానిలో తల్లిదండ్రులు మరణించిన కుటుంబాల్లోని మైనర్లకు ల్యాండ్‌లెస్‌ పూర్‌ పెన్షన్‌ను బదిలీ చేసే అధికారాన్ని సీఆర్‌డీఏకు ఇస్తూ నిర్ణయం. వీరికి ఆధార్‌ ఆధారంగా చెల్లింపులు చేయడానికి ఆమోదం.

  • టీటీడీ వైద్య విభాగంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌, రేడియోగ్రాఫర్‌, ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి, సీనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, చీఫ్‌ రేడియోగ్రాఫర్‌, చీఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులు సృష్టించడానికి అనుమతి.

  • ఏపీ ఎలక్ర్టిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2026ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ఆమోదం.

  • హడ్కో నుంచి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.900కోట్ల ప్రత్యేక గడువు రుణం పొందడానికి జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించారు.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు అదనపు వనరుల సమీకరణ. రుణ పరిమితులను అదనంగా రూ.11,850 కోట్లకు పెంచి, ఎన్సీడీల జారీకి అనుమతి.

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం గతంలో తీసిన రాళ్లలో సగానికిపైగా పనికిరావని నిపుణులు తేల్చినందున మెతక రాళ్లను తొలగించి, హిల్‌ నం.902లో రాతి తవ్వకానికి ఆమోదం. ఎడమ ప్రధాన కాలువ అనుసంధాన పనుల్లో భాగంగా ప్యాకేజ్‌ నం.66లో దాదాపు 890 మీటర్ల పొడవు ఉన్న నావిగేషన్‌ గుహల నిర్మాణం, సాడిల్‌ డ్యాం కేఎల్‌ నిర్మాణంతో సహా ఆఫ్‌ టేక్‌ రెగ్యులేటర్‌ పనుల నిర్మాణానికి ఆమోదం.

  • శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ చట్టాన్ని సవరించి, లెప్రసీ అనే పదాన్ని తొలగించే ముసాయిదా బిల్లుకు ఆమోదం.


పలు సంస్థలకు భూ కేటాయింపులు

  • ద్వారకాతిరుమల మండలం రాఘవాపురంలో రెండెకరాల ప్రభుత్వ భూమిని షిర్డీ సాయి మందిర అభివృద్ధి కోసం ఎకరం రూ.30 లక్షల చొప్పున కేటాయింపునకు ఆమోదం.

  • ఏపీ క్లీన్‌ ఎనర్జీ పాలసీ ప్రకారం ప్రభుత్వ భూమిని సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌కు 33ఏళ్ల పాటు లీజుకు కేటాయింపు. తాడిపత్రి మండలం తలారిచెరువులో 2,191.57 ఎకరాలు, అలూరులో 456.51 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్‌ విలువపై 10శాతం చెల్లింపుతో కేటాయింపు. తలారిచెరువులో ఎకరానికి రూ.2.15 లక్షలు, అలూరులో రూ.2.50లక్షలు చొప్పున లీజుకు నిర్ణయం.

  • గాలివీడు మండలం తూముకుంటలో 100 మెగావాట్ల అల్ర్టా మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు 52.99 ఎకరాలు ఎకరా రూ.31వేలు చొప్పున, రెండేళ్లకోసారి 5 శాతం పెంపుతో 30 ఏళ్ల పాటు లీజుకు కేటాయింపు.

  • రామాయపట్నం పోర్టు దగ్గర ఇండస్ర్టియల్‌ హబ్‌ ఏర్పాటుకు ఏపీ మారిటైమ్‌ బోర్డుకు భూమి కేటాయించాలని నిర్ణయం.

  • మదనపల్లె మండలం వలసపల్లిలో 6.09 ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఉచితంగా ఇవ్వడానికి అనుమతి..

  • ఎమ్మిగనూరు మండలం బనవాసిలో 77.37 ఎకరాల ప్రభుత్వ భూమిని మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయంపునకు ఆమోదం.

  • అల్లూరి జిల్లా నందకోటలో 12.59 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్యూజ్‌మెంట్‌ థీమ్‌ పార్కుతో కూడిన ఫైవ్‌స్టార్‌ రిసార్ట్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధి కోసం ఏపీ టూరిజం అథారిటీకి కేటాయింపునకు అంగీకారం.

  • రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ, మండల కేంద్రంలో జాతీయ పార్టీలు లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు సొంత భూమి లేకపోతే గరిష్ఠంగా 0.50ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడానికి రెవెన్యూ చట్ట సవరణకు ఆమోదం. అరెకరానికి లీజు ఏడాదికి రూ.1,000గా నిర్ణయం.

  • విశాఖ గ్రామీణ మండలం ఎండాడలో 9.04 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఏఐజీ హాస్పటల్స్‌ చైర్మన్‌కు కేటాయింపు. గజానికి రూ.44 వేలు లేదా ఎకరం రూ.5 కోట్లకు కేటాయింపు.

  • కృష్ణపట్నం ఓడరేవు అవసరాలకు భూ కేటాయింపులకు బదులుగా వరికుంటపాడులో 230 ఎకరాలు, పంగిలిలో 216 ఎకరాలు, ఎర్రబిల్లిలో 468 ఎకరాలు, గుడినారవ, దేవరాజు-సూరాయపల్లిలో కొంత ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి క్యాబినెట్‌ ఆమోదించింది.

Updated Date - Jan 29 , 2026 | 08:33 AM