Share News

15 లక్షల కొత్త పింఛన్లు!

ABN , Publish Date - May 23 , 2026 | 04:34 AM

రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

15 లక్షల కొత్త పింఛన్లు!

  • 60 ఏళ్లు నిండిన వృద్ధులు, 50 ఏళ్లు నిండిన

  • బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు చాన్స్‌

  • మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధం

  • స్థానిక ఎన్నికల్లోపు మంజూరు!

  • 77లక్షలకు పెరగనున్న లబ్ధిదారులు

  • ప్రతి నెలా 700 కోట్ల అదనపు భారం

  • ఏటా 41 వేల కోట్లకు చేరనున్న బడ్జెట్‌

  • ప్రస్తుతం రాష్ట్రంలో 28 రకాల పెన్షన్లు

అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరుచేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకు పెన్షన్‌ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కొత్తగా సుమారు 15 లక్షల దాకా అర్హులు ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో 62.47 లక్షల మంది సుమారు 28 రకాల పెన్షన్లు అందుకుంటున్నారు. కొత్తగాచేరే లబ్ధిదారులతో కలిపి ఈ సంఖ్య 77 లక్షలకు చేరనుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి నెలా రూ.2720.67 కోట్లు పెన్షన్ల కోసం కేటాయిస్తున్నారు. ప్రతి నెలా ఇకపై అదనంగా రూ.700 కోట్ల వ్యయమవుతుందని అంచనా. దీనివల్ల ఏటా అదనంగా రూ.8400 కోట్ల అదనపు భారం పడనుంది. ఏటా ఎన్టీఆర్‌ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్ల నిధులు వెచ్చిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు ఇంత భారీ స్థాయిలో బడ్జెట్‌ కేటాయించడం దేశంలోనే రికార్డుగా పేర్కొంటున్నారు. ప్రతి దఫా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక పెన్షన్‌దారులకు మహర్దశ పడుతోంది.


ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు 69 లక్షలు ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకు సంబంధించిన 13 జిల్లాలకు 35.32 లక్షలు పంపిణీ చేసేవారు. అప్పటి వరకు వృద్ధాప్య, వితంతువులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి వృద్ధాప్య, వితంతువులు, చేనేత, కల్లుగీత, కళాకారులు, 40-79 శాతం మధ్య వికలత్వం ఉన్నవారికి రూ.1000, దివ్యాంగులకు రూ.1500 ఇచ్చారు. ఆ తర్వాత పెన్షన్ల సంఖ్య ను పెంచుతూ 2014 అక్టోబర్‌ 25న జీవో నెం.140ను విడుదల చేశారు. 3.72 లక్షల పెన్షన్లను కొత్తగా మంజూరు చేయడంతోపాటు ఈ పెన్షన్లను 2014 అక్టోబరు, నవంబ రు నెలల నుంచి పంపిణీ చేశారు. ఆ తర్వాత డిసెంబరు 1న మరో 3.46 లక్షల కొత్త పెన్షన్లు మంజూరుచేస్తూ జీవో. నెం. 1060 విడుదల చేశారు. ఆ తర్వాత గిరిజనుల్లో ప్రిమిటివ్‌ ట్రైబల్స్‌ గ్రూప్‌ తెగలో శారీరకంగా చిన్న వయస్సులోనే వృద్ధాప్యం సంక్రమిస్తుంది. దీంతో వారికి 50 ఏళ్లకే పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. 2014 డిసెంబరు 16న జీవో నెం. 157ను దీనికోసం విడుదల చేశారు. ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించి, పెన్షన్లు మంజూరుచేశారు. ఆ తర్వాత 2015 ఏప్రిల్‌ 18న జీవో నెం. 39 ద్వారా ట్రాన్సజెండర్లకు పెన్షన్లు మంజూరుచేశారు. 2015 జూన్‌ 30న కొత్త పెన్షన్లు మరో 1.50 లక్షలు మంజూరు చేశారు. జూన్‌ 2015 నుంచి ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. 2018 డిసెంబరు నుంచి పెన్షన్ల మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచుతూ, 2019 జనవరి 25న జీవో నెం. 13ను విడుద ల చేశారు. దాని ప్రకారం రూ.1000 పొందుతున్న పెన్షన్‌దారులు రూ.2 వేలు, రూ.1500 పొందుతున్న దివ్యాంగులకు రూ.3 వేలకు పెంచారు. 2019 జనవరి నుంచి అమల్లోకి తెస్తూ రెండు నెలల పెన్షన్లను ఒకేసారి ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. అంటే ఇదంతా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు జరిగిన ప్రక్రియ. ఆ రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సంఖ్య 54.06 లక్షలు. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారన్న దానిపై 2019 జనవరి 28న జీవో నెం.16ను విడుదల చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం అప్పటి వరకు ఇస్తున్న 50.51 లక్షలతోపాటు అదనంగా మరో 3.55 లక్షల మంజూరుచేసి మొ త్తం 54.06 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


జగన్‌ ఐదేళ్లూ ఎండమావులే..

జగన్‌ తన ప్రమాణ స్వీకారం నాడే అవ్వా తాతలకు ఇచ్చే పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.2,250లకు, పింఛన్లకు అర్హతా వయస్సు ను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల కు తగ్గిస్తూ మొదటి సంతకం చేశారు. జూలై 1, 2019 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందన్నారు. అయితే ఈ ఉత్తర్వుల ప్రకా రం పెంచిన పెన్షన్‌ రూ.2,250 అమలైందే తప్ప తగ్గించిన పెన్షన్‌ అర్హతా వయస్సుకు సంబంధించి ఉత్తర్వులు అమల్లోకి రాలేదు. ఏడాది తర్వాత 60 ఏళ్ల పెన్షన్‌ అమల్లోకి తెస్తామంటూ ఉత్తర్వులిచ్చారు. ఏడాదిలో రెండు దఫాలు మాత్రమే దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పా రు. అయితే ఆ హామీని కూడా అమలు చే యలేదు. ఆరంచెల విధానంగా ఉన్న పెన్షన్ల ను రద్దు చేసి కొత్తగా 10 లక్షల పెన్షన్లు మా త్రమే ఇచ్చారు. అగ్రవర్ణ పేదల్లో 60 ఏళ్లు పైబడిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో 50 ఏళ్ల పైబడిన వారు పెన్షన్ల కోసం ఆ ఐదేళ్లూ ఆశగా ఎదురుచూశారు.

Updated Date - May 23 , 2026 | 04:35 AM