సోషల్ మీడియాకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిందే
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:24 AM
నిర్ణీత వయసు లోపు మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధి విధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు...
ఇందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకాధికారి
అధికారులకు మంత్రుల ఆదేశం.. లోకేశ్ అధ్యక్షతన సమావేశం
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): నిర్ణీత వయసు లోపు మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధి విధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై బుధవారం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశానికి లోకేశ్ అధ్యక్షత వహించారు.చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా లోకేశ్ సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మలేసియాలో 16 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని తెలిపారు.చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలన్న విషయంపై మంత్రుల బృంద సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసే వారితోపాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే నేరగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.