ఎయిడెడ్ సిబ్బందికి సర్వీస్ రూల్స్
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:03 AM
ఎయిడెడ్ కాలేజీల నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక రూల్స్ రూపొందిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రభుత్వంలో చేరినప్పటి నుంచే సీనియారిటీ
డిగ్రీ కాలేజీల్లోని ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు
ప్రత్యేక రూల్స్ జారీచేసిన ఉన్నత విద్యాశాఖ
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ కాలేజీల నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక రూల్స్ రూపొందిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2021లో ఎయిడెడ్ నుంచి ప్రభుత్వం లోకి విలీనమైన సిబ్బందికి ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ నిబంధనలు 2021 ఆగస్టు 10 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తారు. విలీనం ద్వారా వచ్చిన సిబ్బందికి వారి హోదాకు సమానమైన పోస్టులు కేటాయిస్తారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేస్తారు. లేని పక్షంలో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి, వారి స్థానిక కేడర్ ఆధారంగా నియమిస్తారు. అయితే కొత్తగా సృష్టించే సూపర్ న్యూమరీ పోస్టులు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సీసీఏ రూల్స్ వర్తిస్తాయి. సిబ్బంది ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన తేదీ నుంచే సీనియారిటీ వర్తిస్తుంది. అంతకుముందు ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసిన సీనియారిటీ వర్తించదు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా ఏర్పాటైన డిగ్రీ కాలేజీలు, సిబ్బంది కొరత ఉన్న కాలేజీలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలకు డిప్యుటేషన్‌పై పంపే అవకాశం ఉంటుంది.