‘ఈ-ఆఫీస్’ తప్పనిసరి
ABN , Publish Date - May 23 , 2026 | 04:37 AM
రోజువారీ పాలనా వ్యవహారాల్లో అన్ని శాఖలు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో, తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ స్థాయి వరకూ పాటించాల్సిందే
సర్కారు జారీచేసే ఉత్తర్వులు, ఆదేశాలు తదితరాలన్నీ ఇకపై డిజిటల్ ఫార్మాట్‌లో
ప్రతీ శాఖ పురోగతి నివేదికలు ఇవ్వాలి
తప్పాల్, డిస్పాచ్‌లు నమోదు చేయాలి
హెచ్‌వోడీ లాగిన్‌ను ఇతరులు వాడొద్దు
అన్ని శాఖలకు జీఏడీ ఉత్తర్వులు జారీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రోజువారీ పాలనా వ్యవహారాల్లో అన్ని శాఖలు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో, తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి అంశంలో విధిగా ఈ-ఫైల్ విధానాన్ని ఆచరించాలని నిర్దేశించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి మార్గదర్శకాలు, సూచనలు ఇస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జి. శ్యామలరావు తాజాగా మెమో జారీ చేశారు. పాలనలో పేపర్ లెస్ విధానం కింద ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ను దశాబ్దానికి పైగా అమలు చేస్తోంది. అయితే, ఏయే శాఖల్లో అమలవుతోంది? అందులో ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వాలని ఐటీ శాఖ కోరుతోంది. దీనిపై కొన్ని శాఖలు కనీసం స్పందించడం లేదు. ఇప్పటికీ వాటిల్లో భౌతికంగా పైళ్ల విధానం అమలు చేస్తుండటమే దీనికి కారణం.
కొన్ని శాఖల్లో ఈ-ఆఫీస్ పాక్షికంగానే అమలవుతోంది. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. ఈ-ఆఫీ్‌సను తప్పనిసరి చేసింది. పాలనాంశాలు, రెగ్యులర్ ఫైళ్లు, విధానపరమైన అంశాలు, ప్రజల నుంచి స్వీకరించే పిటిషన్లు, సర్కారు జారీచేసే ఉత్తర్వులు, ఆదేశాలు తదితరాలన్నీ ఇకపై డిజిటల్ ఫార్మాట్‌లో ఉండాలని ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ శాఖ, రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతి(హెచ్‌వోడీ), జిల్లా, మండల, గ్రామీణ స్థాయి ఆఫీసుల వరకు విధిగా ఈ-ఫైల్ విధానం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి వచ్చే విన్నపాలు, సేవలు కోరుతూ వచ్చే పిటిషన్లు అన్నీ ఈ-తప్పాల్ కింద నమోదు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలు, ఉత్తర్వులు, ఇతర ఆఫీసులకు, ప్రజలకు పంపించే సందేశాలను ఈ-డిస్పాచ్‌లో విధిగా నమోదు చేయాలని, జవాబుదారీ ఉండేలా చర్యలు తీసుకోవాలని జీఏడీ నిర్దేశించింది. 8 ఈ-ఆఫీ్‌స అమలు పురోగతిపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా నివేదికలు పంపాలి.
ఈ-ఆఫీస్ విధానంలోకి రాని ఆఫీసులు, విభాగాలు తక్షణమే దాన్ని అమలు చేయాలి.
ప్రభుత్వ విభాగం, కార్యాలయానికి సంబంధించిన ఈ-తప్పాల్, ఈ-డిస్పాచ్ మెయిల్ ఐడీ యాక్టివ్‌గా లేకున్నా, వాడకుండా వదిలేసినా, వెంటనే ఐటీ శాఖకు సమాచారం ఇచ్చి, అది తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
ఒక శాఖకు సంబంధించిన ఇతర ఉద్యోగుల ఫైళ్లు, ఇతర సమాచారాన్ని విభాగాధిపతి లాగిన్ నుంచి నిర్వహించడానికి వీల్లేదు. ప్రతి విభాగం, ప్రతి అధికారి విధిగా ఈ-ఆఫీస్ లాగిన్ వివరాలు కలిగి ఉండాలి.
విభాగాధిపతి లాగిన్‌ను ఆయన తప్ప ఇతరులు వినియోగిండానికి వీల్లేదు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జీఏడీ హెచ్చరించింది.