Share News

11 వేల మంది టీచర్లకు ఓపీఎస్‌!

ABN , Publish Date - May 29 , 2026 | 05:04 AM

కూటమి ప్రభుత్వం సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులకు మేలు చేసేలా త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా...

11 వేల మంది టీచర్లకు ఓపీఎస్‌!

  • సీఎంవోకు చేరిన కీలక ఫైలు.. త్వరలో జీవో

  • 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయిన ఉపాధ్యాయులకు మేలు

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులకు మేలు చేసేలా త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా 2004 తర్వాత భర్తీ అయిన టీచర్లకు పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌) అమలుకు చర్యలు ప్రారంభించింది. 2003 డీఎస్సీ టీచర్ల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకొనే దిశగా అడుగులు వేసింది. సంబంధిత ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి.. అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అమల్లోకి వచ్చింది. అంతకముందు నియామకం అయిన ఉద్యోగులకు మాత్రమే ఓపీఎస్‌ అమలు చేస్తున్నారు. గత కొంతకాలంగా సీపీఎస్‌ను రద్దు చేయాలనే ఉద్యమం జరుగుతోంది. అయితే 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన దాదాపు 11 వేల మంది టీచర్లు వివిధ కారణాలతో 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరారు. దీంతో వారు సీపీఎస్‌ పరిధిలోకి వచ్చారు. సీపీఎస్‌ అమలు కంటే ముందే విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా తాము ఉద్యోగాలు పొందినందున, తమకు ఓపీఎస్‌ అమలు చేయాలని ఆ టీచర్లు కోరుతూ వస్తున్నారు. నోటిఫికేషన్లు ముందే విడుదలయ్యాయనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వారికి పాత పెన్షన్‌ స్కీం అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

Updated Date - May 29 , 2026 | 06:54 AM