కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 21 , 2026 | 04:16 AM
ర్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టంచేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య ...
రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాల ఏర్పాటు
వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధి దెబ్బతీసింది
గతంలో నిలిచిపోయిన పథకాలను మేం అమలు చేస్తున్నాం
శ్రమ శక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాలప్రదానోత్సవంలో మంత్రి సుభాష్
విజయవాడ అర్బన్, మే 20 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టంచేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళా క్షేత్రంలో జరిగిన శ్రమ శక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాఽధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఒక కార్మికుడు పని కోసం యాజమాన్యం వద్దకు వెళ్తే తన ప్రాణాలను వారి చేతిలో పెట్టి వెళ్తున్నట్టేనని భావించి, యాజమాన్యాలు పూర్తి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, భవన నిర్మాణ కార్మికులకు అమలులో ఉన్న పథకాలను రద్దు చేసి వారి జీవనోపాధిని దెబ్బతీశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’, ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని వెల్లడించారు.
భవన నిర్మాణ కార్మికులకు గతంలో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణ సహాయంగా రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు అందిస్తున్నట్టు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘‘లేబర్ అడ్డాస్’’ ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, వాష్‌రూమ్, భోజన, శిక్షణ సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. రూ.250 కోట్లతో భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రత కోసం యూనివర్సిటీలతో ఎంఓయూలు కుదుర్చుకొని థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తామని తెలిపారు. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ దృష్ట్యా డిపార్ట్‌మెంట్‌లో అనేక మార్పులను తీసుకువచ్చామని తెలిపారు. మంత్రి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు, ఆదర్శవంతమైన యాజమాన్యాలకు పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వి.మల్లిఖార్జున రావు (బాబ్జీ), ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సలహా కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు ఉపాధ్యక్షుడు జి.వెంకట శివుడు యాదవ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.