దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:10 AM
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది.
40 శాతం వైకల్యం దాటిన వారికి వర్తింపు
వారి సహాయకులకు చార్జీల్లో 50 శాతం రాయితీ
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి బుధవారం మంగళగిరిలో శ్రీకారం చుడతారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గత ఏడాది డిసెంబరు 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లు, 100 శాతం మూగ, చెవిటివారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎ్‌సఆర్టీసీ సిటీ, ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్న వారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోంది. అయితే ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. వారితోపాటు వచ్చే సహాయకులకు ఈ బస్సుల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది.
ఇకపై 21 వర్గాలకు పథకం వర్తింపు
ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. శారీరక- మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా.. పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు, 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 12.76 లక్షలకు పెరగనుంది. స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. అవసరమైన డిజిటల్ పాస్‌లు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్‌ను సదరం యాప్‌తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికెట్స్ చూపించాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో ఉచిత డి జిటల్ పాస్‌లు జారీ చేస్తారు. పథకం అమలుకు ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లు సబ్సిడీగా అందిస్తుంది.