సైబర్ నేరాలకు అడ్డుకట్ట!
ABN , Publish Date - May 30 , 2026 | 04:40 AM
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించారు. సైబర్ మోసాలు జరిగిన తర్వాత గోల్డెన్ అవర్‌లో స్పందించడం మంచిదే అయినా..
ప్రజల సొమ్ము దోచుకునే వారిని ఉపేక్షించొద్దు
ఏపీలో నేరాలు చేయాలంటే భయపడాలి
పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించారు. సైబర్ మోసాలు జరిగిన తర్వాత గోల్డెన్ అవర్‌లో స్పందించడం మంచిదే అయినా.. అసలు నేరం జరక్కుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన వెంటనే ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసి బ్యాంకుల్ని అప్రమత్తం చేయాలని, నిరంతరం నిఘా పెట్టి సైబర్ దొంగలకు చెక్ పెట్టాలన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ‘ఏపీ సైబర్ గార్డ్స్’ పేరుతో భద్రతా వ్యవస్థను తీసుకొస్తోంది. దీనిపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్షించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని బెదిరిస్తున్నారని, అసలు అలాంటి వ్యవస్థ లేదని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ‘అలాంటి ఫోన్‌కాల్స్ చేసే వారు దేశంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి జైలుకు పంపండి.. అప్పుడే ఏపీలో నేరాలు చేయాలంటే భయపడతారు.. రాష్ట్ర ప్రజల పొదుపును సైబర్ దొంగలు దోచుకొంటుంటే ఉపేక్షించొద్దు’ అని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
‘సిక్స్ పిల్లర్ సిస్టమ్’పై డీజీపీ ప్రజంటేషన్
సైబర్ నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ‘సిక్స్ పిల్లర్ సిస్టమ్’పై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇందులో సైబర్ వార్ రూమ్, 1930 కాల్ సెంటర్ డ్యాష్ బోర్డ్, ఏఐ-టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, 3టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం ప్రధాన భాగాలని వివరించారు. 500 మంది సైబర్ గార్డులతో సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని ప్రభల టెక్ పార్క్‌లో రాష్ట్రస్థాయి సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పదకొండు విభాగాలు పనిచేస్తున్నాయన్నారు. రాబోయే నెల రోజుల్లో ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.