Share News

నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు!

ABN , Publish Date - May 26 , 2026 | 05:01 AM

అసైన్డ్‌ ఇళ్ల స్థలాల రిజిస్ర్టేషన్ల కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు!

  • అసైన్డ్‌ ఇళ్ల స్థలాల రిజిస్ర్టేషన్‌కు ఒరిజినల్‌/సర్టిఫైడ్‌ పట్టా సమర్పించాలి

  • నిర్దిష్ట ప్లాట్‌ నెంబర్‌ ఆధారంగానే ప్రక్రియ

  • చెప్పిన పత్రాలనే అధికారులు అడగాలి

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): అసైన్డ్‌ ఇళ్ల స్థలాల రిజిస్ర్టేషన్ల కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంటి స్థలాల రిజిస్ర్టేషన్‌పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం పేర్కొన్న పత్రాలను తప్ప మరే ధ్రువీకరణ పత్రాలను రిజిస్ర్టేషన్‌ అధికారులు అడగకూడదని పేర్కొంది. తమ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం లబ్ధిదారుడు రెవెన్యూ అధికారి జారీచేసిన ఒరిజినల్‌ పట్టా లేదా సర్టిఫైడ్‌ కాపీని తప్పనిసరిగా సమర్పించాలని, ఆ భూమిని ఇంటి స్థలంగానే కేటాయించినట్లు నిరూపించాలని పేర్కొంది. ఒకవేళ లబ్ధిదారుడు నకిలీ పత్రాలు సమర్పిస్తే తక్షణమే ఆ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను నిలిపివేస్తారు. రిజిస్ర్టేషన్‌ చట్టం-1908లోని 82, 83 సెక్షన్ల ప్రకారం సివిల్‌, క్రిమినల్‌ చర్యలు ఉంటాయని తీసుకుంటారని హెచ్చరించింది.


ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం..

  • దరఖాస్తుదారు తమ స్థలం ఒరిజినల్‌ పట్టాను దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా సమర్పించాలి. ఆ ఒరిజినల్‌ పట్టా జారీచేసిన తేదీ నుంచి కనీసం 10 సంవత్సరాలు గడిస్తేనే రిజిస్ర్టేషన్‌ చేస్తారు.

  • లబ్ధిదారుడు గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ/మున్సిపల్‌ కార్పొరేషన్‌ జారీచేసిన ఇంటి పన్ను రశీదు లేదా ఇతర రికార్డులు సమర్పించాలి.

  • రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ సంబంధిత సర్వే నెంబర్‌/బ్లాక్‌ నెంబర్‌తో పాటు నిర్దిష్ట ప్లాట్‌ నెంబర్‌ ఆధారంగా జరగాలి. ప్లాట్‌ నెంబర్‌ ప్రస్తావన లేకుండా కేవలం సర్వే/బ్లాక్‌ నెంబర్‌ ఆధారంగా రిజిస్ర్టేషన్‌ చేయకూడదు.

  • రిజిస్ర్టేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అసలు కేటాయింపుదారులా లేక వారి చట్టపరమైన వారసులా అనేది నిర్ధారించుకోవాలి. ఒకవేళ దరఖాస్తును చట్టపరమైన వారసులు తీసుకొస్తే.. అలాంటి సమయంలో అసలు కేటాయింపుదారు మరణ ధ్రువీకరణ పత్రం, వారి బంధుత్వాన్ని ధ్రువీకరిస్తూ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను జతపరచాలి.

  • ప్రభుత్వం నోటిఫై చేసిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ లేదా ఇతర పథకాల కింద ఇప్పటికే క్రమబద్ధీకరించిన లేదా లావాదేవీలు జరిగిన ఇంటి స్థలాల రిజిస్ర్టేషన్లకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేకుండానే సబ్‌రిజిస్ర్టార్లు రిజిస్ర్టేషన్‌ చేయాలి.

  • ఒకసారి ఆస్తి రిజిస్టర్‌ అయిన తర్వాత మళ్లీ లావాదేవీలు నిర్వహించాలంటే 90రోజులు ఆగాల్సిందే.

Updated Date - May 26 , 2026 | 05:01 AM