దీర్ఘకాలం పెండింగ్‌కు చెక్
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:39 AM
సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో పత్రాల పెండింగ్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలతో గురువారం జీవో జారీ చేసింది.
పెండింగ్ పత్రాల పరిష్కారానికి కాలపరిమితి
స్పష్టమైన మార్గదర్శకాలతో జీవో జారీ
పాటించని సబ్‌రిజిస్ర్టార్లపై క్రమశిక్షణ చర్యలు
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో పత్రాల పెండింగ్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలతో గురువారం జీవో జారీ చేసింది. ఏదైనా పత్రాన్ని పెండింగ్‌లో పెట్టినప్పుడు సబ్‌రిజిస్ర్టార్ కచ్చితంగా అదే రోజు సంబంధిత వ్యక్తికి రాతపూర్వకంగా చెక్‌స్లిప్ ఇవ్వాలని, అందులో పెండింగ్ పెట్టడానికి కచ్చితమైనా కారణం రాసి, అది ఎప్పుడు పూర్తవుతుందో తెలపాలని స్పష్టం చేసింది. ఇంకా..
ప్రతి పెండింగ్ డాక్యుమెంట్‌ను సమర్పించిన రోజే ఆన్‌లైన్ కార్డ్ 2.0 సిస్టమ్‌లో నమోదు చేయాలి.
స్టాంపు డ్యూటీ తక్కువగా ఉన్న పత్రాలను 3 రోజుల్లోగా జిల్లా రిజిస్ర్టార్‌కు ఆన్‌లైన్ ద్వారా పంపాలి. వారు ఆ పత్రం అందిన తేదీ నుంచి 2 నెలల లోపు ఆ సమస్యను పరిష్కరించాలి.
ఆలస్యానికి గల స్పష్టత కోసం పెండింగ్‌లో ఉంచిన పత్రాలను మూడు రోజుల్లోగా ఆన్‌లైన్‌లో జిల్లా రిజిస్ర్టార్‌కు పంపాలి. ఇలాంటి కేసులను జిల్లా రిజిస్ర్టార్ ఏడు పనిదినాల్లోగా పరిష్కరించాలి.
పరిశీలన కోసం పెండింగ్‌లో ఉంచిన పత్రాలను 3 పనిదినాల్లోగా పరిశీలించి రిజిస్ర్టేషన్‌కు అనుమతించాలి.
జిల్లా రిజిస్ర్టార్లు తమపరిధిలోని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో పెండింగ్ డాక్యుమెంట్లను రోజువారీగా సమీక్షించాలి. రెండు వారాలకు పైగా పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను ఆ శాఖ ఐజీ దృష్టికి తీసుకురావాలి.