Share News

ముగ్గురు ముద్దు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:24 AM

‘మేమిద్దరం... మాకిద్దరు!’ ‘ఇద్దరు ముద్దు... ముగ్గురు వద్దు!’ ‘చిన్న కుటుంబం... చింతల్లేని కుటుంబం!’ ఈ నినాదాలకు కాలం చెల్లింది! ‘కుటుంబ నియంత్రణ’ కాలం పోయింది.

ముగ్గురు ముద్దు

  • మూడో బిడ్డను కంటే 25 వేల ప్రోత్సాహకం

  • బిడ్డ పోషణకు ఐదేళ్ల పాటు నెలకు 1000 సాయం

  • ఏప్రిల్‌ 1 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ

  • 18 ఏళ్ల వరకు ఉచిత విద్య.. ముగ్గురు, అంతకంటే

  • ఎక్కువ మందిని కనే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు

  • తల్లికి 12 నెలలు.. తండ్రికి 2 నెలలు మంజూరు

  • సంతాన సాఫల్య రేటు 2.1కి తీసుకెళ్లడమే లక్ష్యం

  • చైల్డ్‌ కేర్‌ సెంటర్లు, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల ఏర్పాటు

  • భవిష్యత్తులో అధిక జనాభా భారం కాదు.. సంపద

  • ఎంతో దూరదృష్టితో ఆలోచించే ముసాయిదా

  • దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నూతన విధానం

  • శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘మేమిద్దరం... మాకిద్దరు!’ ‘ఇద్దరు ముద్దు... ముగ్గురు వద్దు!’ ‘చిన్న కుటుంబం... చింతల్లేని కుటుంబం!’ ఈ నినాదాలకు కాలం చెల్లింది! ‘కుటుంబ నియంత్రణ’ కాలం పోయింది. ‘ఒక్కరితో ఆగొద్దు! ముగ్గురైతే మరింత ముద్ద్దు’... అని ప్రభుత్వమే పిలుపునిస్తోంది. అంతేకాదు... మూడో బిడ్డ జన్మించగానే పాతికవేల నగదు కానుక! ఇంకా రకరకాల ప్రోత్సాహకాలు! ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన ‘పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌’ విధానం! మూడో సంతానాన్ని కంటే రూ.25 వేల ప్రోత్సాహకంతో పాటు ‘పోషణ, శిక్షా-సురక్ష’ ప్యాకేజీ కింద ఆ బిడ్డ పోషణకు ఐదేళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేగాక 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ‘జనాభా నిర్వహణపై ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా పాలసీ’పై గురువారం శాసనసభలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో జనాభా పెంపు ఆవశ్యకత గురించి వివరించారు. ‘గతంలో జనాభా పెరిగితే ఏమవుతుందోనని ఆందోళన చెందేవారం. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను మార్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యమిచ్చాం.


ఇకపై జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జనాభా పెరుగుదల భారం కాదు.. సంపద. అందుకే దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ‘పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ’ని ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తాం. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని.. అనే ఐదు అంశాలు మూలస్తంభాలుగా ఈ పాలసీని అమలు చేస్తాం. అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నాం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలి. జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నెలాఖరు నాటికి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీకి తుది రూపం ఇస్తాం. ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి తీసుకువస్తాం. ఏడాది కాలంలో వచ్చిన ఫలితాలను పరిశీలించిన తర్వాత పాలసీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ‘హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ’ లక్ష్యం పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం’’ అని చంద్రబాబు తెలిపారు.


‘పాలసీ’.. ఎందుకంటే

‘‘జపాన్‌, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది. జనాభా తగ్గిపోయి చైనా ఇంకా ఇబ్బందులు పడుతోంది. భారత్‌, ముఖ్యంగా ఏపీలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. 1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఫెర్టిలిటీ రేటు (టీఎ్‌ఫఆర్‌) 3.0గా ఉండేది. ఇప్పుడు 1.5 మాత్రమే ఉంది. దీనిని 2.1కి పెంచాలనేది లక్ష్యం. టీఎ్‌ఫఆర్‌ వేగంగా తగ్గితే వర్క్‌ఫోర్స్‌ పడిపోతుంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతుంది. 2023 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారు. ఉమెన్‌ వర్క్‌ఫోర్స్‌ గణనీయంగా తగ్గిపోతోంది. ఈ గ్యాప్‌ను పూడ్చడానికే పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీకి రూపకల్పన చేశాం. ‘ఒకరు ముద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు వద్దు’ అని గతంలో చెప్పాం. ఇప్పుడు ‘ఒక్కరు వద్దు.. ఇద్దరు ఒకే.. ముగ్గురు ముద్దు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. మూడో సంతానం, ఆపైన పిల్లలను కనే ఉద్యోగులైన తల్లిదండ్రులిద్దరికీ పిల్లల సంరక్షణలో సమ బాధ్యతల కోసం తల్లికి 12నెలలు సెలవుతో పాటు అదనంగా తండ్రికి 2 నెలలు సెలవు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. ‘2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా. వృద్ధుల సంరక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తాం. 175 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్‌ నిర్వహిస్తాం.’’


దూరదృష్టితో ఆలోచించాలి

‘‘పూర్వం ఆస్తి కంటే పిల్లలకే ఎక్కువ విలువనిచ్చేవారు. ఈ రోజుల్లో కూడా పేదలు, గిరిజనులు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. కానీ డబ్బున్న కుటుంబాల్లో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సామాజిక అంశాలపై కూడా ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇవ్వడం జనాభా నిర్వహణకు దోహదపడుతుంది. ఎంతో దూరదృష్టితో ఆలోచించే ఈ జనాభా నిర్వహణ పాలసీని తీసుకువచ్చాం.’’ అని చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, థామస్‌ మోహన్‌, యార్లగడ్డ వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, గళ్లా మాధవి, రెడ్డప్పగారి మాధవిరెడ్డి, కూన రవికుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, విష్ణుకుమార్‌రాజు, అతిథి గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రామాంజనేయులు, సుందరపు విజయ్‌కుమార్‌, వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మాట్లాడారు.


ప్రత్యేక సదుపాయాలు

‘‘మహిళల వర్క్‌ ఫోర్స్‌ ప్రస్తుతం 31 శాతం మాత్రమే ఉంది. ఇది 59 శాతానికి చేరుకుంటే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుంది. గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతిదశలోనూ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది. పిల్లలు లేక బాధపడుతున్నవారికి ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ విధానంలో ఐవీఎఫ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి తగు వైద్య సేవలు అందిస్తాం. సిజేరియన్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 8.8 శాతంగా ఉన్న టీనేజ్‌ ప్రెగ్నెన్సీ రేటును 3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. షి క్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువస్తాం. మహిళా ఉద్యోగులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాల్లో కొత్తగా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.


పాలసీలో కీలకాంశాలు

  • మూడో సంతానాన్ని కంటే డెలివరీ సమయంలోనే రూ.25 వేలు ప్రోత్సాహకం. ఆ బిడ్డ పోషణకు ఐదేళ్ల పాటు నెలకు రూ.1,000 చొప్పున సాయం. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య.

  • 2023 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి జనాభాలో 23శాతం మంది వృద్ధులే ఉంటారు.

  • 1992-93లో ఉమ్మడి ఏపీలో మొత్తం ఫెర్టిలిటీ రేటు 3.0గా ఉండేది. ఇప్పుడు 1.5 మాత్రమే ఉంది. దీనిని 2.1కి పెంచాలనేది లక్ష్యం.

  • మహిళల వర్క్‌ ఫోర్స్‌ ప్రస్తుతం 31 శాతం మాత్రమే ఉంది. ఇది 59 శాతానికి చేరాలి.

  • ప్రస్తుతం 8.8 శాతంగా ఉన్న టీనేజ్‌ ప్రెగ్నెన్సీ రేటును 3 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం.

  • 50 మంది తల్లులు, చిన్నారులు ఒక ప్రాంతంలో ఉంటే అక్కడ చైల్డ్‌ కేర్‌ సెంటర్లు, పింక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు.

  • జూలై నాటికి 5.2 కోట్ల మంది ప్రజలను 2,086 ఆరోగ్య కేంద్రాల ద్వారా డిజిటల్‌గా సంజీవని ప్రాజెక్టుతో అనుసంధానం.

  • విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ నిర్మాణానికి శ్రీకారం. త్వరలో అమరావతి, తిరుపతి నగరాల్లోనూ నిర్మాణం.

Updated Date - Mar 06 , 2026 | 03:26 AM