ప్రభుత్వాస్పత్రులపై పెరిగిన నమ్మకం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:34 AM
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రెండేళ్ల కాలంలో ఓపీ, ఐపీలతో పాటు శస్త్రచికిత్సల్లో 37.38 శాతం పెరుగుదల నమోదైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
శస్త్రచికిత్సల్లో 37.38 శాతం పురోగతి
డీఎంఈ ఆస్పత్రుల్లో 18.69శాతం పెరిగిన ఓపీ
‘జే’ బ్రాండ్లతో పెరిగిన లివర్, కిడ్నీ బాధితులు
14 లక్షల మందికి ఉచిత వైద్యం: సత్యకుమార్
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రెండేళ్ల కాలంలో ఓపీ, ఐపీలతో పాటు శస్త్రచికిత్సల్లో 37.38 శాతం పెరుగుదల నమోదైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు 56.14 శాతం పెరిగాయని చెప్పారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వం ఆరోగ్యశాఖలో సాధించిన పురోగతిని శనివారం విజయవాడలో వివరించారు. 8 పేజీల నివేదికను విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ డీఎంఈ ఆస్పత్రుల్లో ఓపీ 18.69 శాతం, డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు 28.13 శాతానికి పెరిగాయని వివరించారు. వైద్య సిబ్బంది హాజరు 2023-24లో 65.36 శాతం ఉండగా, 2025-26 నాటికి 83.75 శాతానికి పెరిగిందని చెప్పారు. ‘‘2023-24లో 15.13 లక్షల శస్త్రచికిత్సలు జరిగితే, 2025-26 నాటికి అది 20.79 లక్షలకు పెరిగింది. అలాగే 2023-24లో 7.98 కోట్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగ్గా ఆ సంఖ్య 2025-26కు 12.47 కోట్లకు పెరిగింది. ఆరోగ్య సేవలపై ప్రజల్లో 75 శాతం సంతృప్తి ఉంది. దీన్ని రెండేళ్లలో 95 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తున్నాం’ అన్నారు.
ఏటా రూ.3,805 కోట్ల ఖర్చు
కూటమి పాలనలో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో పెరిగి తే, పథకం నిర్వీర్యమైందని ఎలా అంటారని మాజీ సీఎం జగన్‌ను సత్యకుమా ర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఏటా సగటున 8 లక్షల మంది మాత్రమే లబ్ధిపొందారని, ఇప్పుడు వీరిసంఖ్య 14 లక్షలకు పెరిగి 70ు వృద్ధి నమోదైందని స్పష్టంచేశారు. జగన్ పాలనలో ఏటా సగటున రూ.2,315 కోట్లు ఖర్చు చేయగా కూటమి ఏడాదికి రూ.3,805 కోట్లు వ్యయం చేసిందని వివరించారు. గత ప్రభుత్వంలో 108 కోసం ఫోన్ చేసినవారికి పట్టణ ప్రాంతాల్లో 27.03 నిమిషాల్లో వాహనం చేరుకోగా, కూటమి పాలనలో 17.34 నిమిషాల్లోనే చేరుతోందన్నారు.
పారదర్శకంగా నియామకాలు
జగన్ హయాంలో ఉద్యోగ నియామకాలు, పోస్టింగులు, బదిలీల్లో భారీస్థాయి లో రాజకీయ జోక్యం, అవినీతి జరిగిందని సత్యకుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేసిందని తెలిపారు. గత రెండేళ్లలో జరిగిన 12వేల నియామకాలు, 25వేలకు పైగా బదిలీలు, వందలాది పదోన్నతులు, పోస్టింగులకు సంబంధించి ఒక్క వ్యతిరేక వార్త కూడా రాకపోవడం తమ స్వచ్ఛమైన విధానాలకు నిదర్శమన్నారు. ‘జె’ బ్రాండ్ మద్యం కారణంగా లివర్, కిడ్నీ, నరాల బలహీనత సమస్యల బాధితుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. 2020 వరకూ రాష్ట్రంలో లివర్ బాధితుల సంఖ్య 4,917 ఉండగా 2023-24 నాటికి ఆ సంఖ్య 11,232కు (దాదాపు 250ు) చేరుకుందన్నారు. కిడ్నీ బాధితులు 15వేల నుంచి 23,553కు, నరాల బలహీనత, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిసంఖ్య 7,648కు పెరిగిందని, దీనికెవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.