‘33 ఏళ్లకు తప్పనిసరి రిటైర్మెంట్’కు నో
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:15 AM
అన్ని అర్హతల ప్రకారం 33 ఏళ్ల సర్వీసు పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చే నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అయితే...
ఈ సర్వీస్ నిబంధన పట్ల ఏపీ విముఖత
నిజానికి, 1980 నుంచే ఈ నిబంధన
తొలిసారి 2023లో ముసాయిదా తయారుచేసిన వైసీపీ ప్రభుత్వం
ఎన్నికలు దగ్గర పడడంతో అప్పట్లో నిలిపివేత
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అన్ని అర్హతల ప్రకారం 33 ఏళ్ల సర్వీసు పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చే నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో అది ఉంది. దీనిపై వైసీపీ హయాంలో అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ 2023లో ముసాయిదాను సిద్ధం చేశారు. ఇందులోభాగంగా అన్ని రాష్ట్రాల పెన్షన్ నిబంధనలను కేంద్ర నిబంధనలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. కానీ, ఎన్నికలు దగ్గర పడడంతో ఉద్యోగ సంఘాల అభిప్రాయం కోరలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ నిబంధన పట్ల సానుకూలంగా లేదు. ఈ ముసాయిదాపై ఉద్యోగ సంఘాలు కచ్చితంగా అసంతృప్తి వ్యక్తం చేస్తాయి. అందుకే ఈ నిబంధనను తొలగించాలన్న ఉద్దేశంతో ఉంది. 33 ఏళ్ల సర్వీసు తర్వాత తప్పనిసరి రిటైర్మెంట్ అనే నిబంధన 1980 పెన్షన్ నిబంధనల్లో ఉంది. ఆ నిబంధనల్లో మొదటిది అన్ని అర్హతల ప్రకారం 33 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం. రెండోది ప్రజాప్రయోజనాల కోణంలో నియామక అధికారి నోటీసు ఇచ్చి రిటైర్ చేయించడం కానీ, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఈ నిబంధన అమలు చేయలేదు. ప్రస్తుతం ఏపీ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ - 2026లోని నాలుగో నిబంధన ప్రకారం, ప్రజాప్రయోజనాల కోణంలో 33 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగిని తప్పనిసరిగా రిటైర్ చేయించొచ్చు. స్వచ్ఛందంగా రిటైర్ అయ్యే అంశం గురించిన ప్రస్తావన అందులో లేదు. ఎందుకంటే 2026 పెన్షన్ నిబంధనల్లోని రూల్ 13 ప్రకారం 20 ఏళ్ల సర్వీసు పూర్తయిన వెంటనే ఉద్యోగి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయొచ్చు.