Share News

జల్‌జీవన్‌ మిషన్‌కు నాబార్డ్‌ రుణం

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:53 AM

రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కోసం నాబార్డ్‌ నుంచి ఏపీ జల్‌జీవన్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌కు మంజూరైన రూ.8,650 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

జల్‌జీవన్‌ మిషన్‌కు నాబార్డ్‌ రుణం

  • రూ.8,650 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీ

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కోసం నాబార్డ్‌ నుంచి ఏపీ జల్‌జీవన్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌కు మంజూరైన రూ.8,650 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ అసిస్టెన్స్‌ (ఎన్‌ఐడీఏ) కింద ఈ రుణం మంజూరైంది. ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం రుణ ఒప్పందం కుదుర్చుకోవడానికి, కార్పొరేషన్‌ నిర్ణయాలను అమలు చేయడానికి జల్‌జీవన్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అధికారాలు కల్పిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే రుణాల ద్వారా వనరుల సమీకరణ పరిమితిని రూ.12 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు పెంచింది. రుణ కాలపరిమితి మొత్తానికి ప్రభుత్వ హామీ అమల్లో ఉంటుంది. మూలధనం, వడ్డీ రెండింటికీ హామీ వర్తిస్తుంది. వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం తదితర వివరాలతో కూడిన తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను సమర్పించాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌ రుణ బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 04:57 AM