7న వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:08 AM
భారతి సిమెంట్స్ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సున్నపురాయి లీజులు ఎందుకు రద్దుచేయకూడదంటూ ఇచ్చిన నోటీసులపై ఏప్రిల్ 7న అమరావతికి వచ్చి ప్రభుత్వం ముందు వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం కల్పించింది.
భారతి సిమెంట్స్‌కు మరో అవకాశం!
తేదీ ఖరారు చేసి గనులశాఖ నోటీసు
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): భారతి సిమెంట్స్ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సున్నపురాయి లీజులు ఎందుకు రద్దుచేయకూడదంటూ ఇచ్చిన నోటీసులపై ఏప్రిల్ 7న అమరావతికి వచ్చి ప్రభుత్వం ముందు వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆ తేదీని ఖరారు చేస్తూ నోటీసు పంపించింది. వివరాలివీ.. జగన్ ప్రభుత్వ హయాంలో కడప జిల్లా కమలాపురం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో తమ సొంత కంపెనీ భారతి సిమెంట్స్‌కు 235.56 ఎకరాల్లో సున్నపురాయి లీజులు 50 ఏళ్లకు ఇచ్చారు. ఇది అక్రమం, చట్టవిరుద్ధమని కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా కేంద్రం విచారణకు ఆదేశించింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం(ఎంఎండీఆర్)1957 లోని నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆ లీజులను కేటాయిస్తూ 2024 ఫిబ్రవరి 2న నాటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని కూటమి సర్కారు గుర్తించింది. ఎంఎండీఆర్ చట్టంలోని సెక్షన్ 10(ఏ) (2)(సి)కి విరుద్ధంగా ఆ లీజులు ఇచ్చి, అక్రమంగా భారతి సిమెంట్స్‌కు లబ్ధిచేకూర్చారని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆ లీజులను ఎందుకు రద్దుచేయకూడదో పక్షం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని 2025 డిసెంబరు 11న భారతి సిమెంట్స్‌కు గనుల శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ సంస్థ విభిన్నంగా స్పందిస్తూ, తనకిచ్చిన నోటీసులను ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. చట్టపరిధిలో, నిబంధనల మేరకే లీజులు ఇచ్చారని పేర్కొంటూ, వ్యక్తిగతంగా హాజరై తమ అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని జనవరిలో ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. తొలుత అవకాశం ఇవ్వొద్దని, లీజులను రద్దుచేయాలనే అధికారులు భావించారు. ఈ మేరకు లీజుల రద్దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలని కోరుతున్నందున దాన్ని పరిశీలించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయించారు.