Share News

క్రీడా రిజర్వేషన్ల అమలుకు రెండు కమిటీలు

ABN , Publish Date - May 16 , 2026 | 04:47 AM

క్రీడాకారుల కోసం అమలు చేస్తున్న 3 శాతం రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేసింది.

క్రీడా రిజర్వేషన్ల అమలుకు రెండు కమిటీలు

  • రాష్ట్ర స్థాయి, స్ర్కీనింగ్‌ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు

  • 3 శాతం క్రీడా రిజర్వేషన్ల మార్గదర్శకాల్లో సవరణలు

అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల కోసం అమలు చేస్తున్న 3 శాతం రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేసింది. ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం 2024 డిసెంబరు 10న విడుదల చేసిన జీవోలో.. 3 శాతం క్రీడా రిజర్వేషన్‌ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు. అనంతరం వివిధ క్రీడాసంఘాల నుంచి వచ్చిన విన్నపాలు, ఫిర్యాదుల ఆధారంగా తాజాగా కొన్ని సవరణలు చేశారు. వీటి ప్రకారం స్ర్కీనింగ్‌ కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించనుంది. వాటిలో స్ర్కీనింగ్‌ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. ఈ కమిటీలో శాప్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ చైర్మన్‌గా ఉంటారు. ఇద్దరు సీనియర్‌ డీఎ్‌సడీవోలు, ట్రైబల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ కోచ్‌, శాప్‌లోని టెక్నికల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మెంబర్లుగా ఉంటారు. ఏపీపీఎస్సీ లేదా రిక్రూట్‌మెంట్‌ బోర్డులు పంపిన క్రీడాకారుల జాబితాను స్ర్కీనింగ్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి మెరిట్‌ లిస్ట్‌ సిద్ధం చేస్తుంది. దాన్ని రాష్ట్రస్థాయి కమిటీకి సిఫారసు చేస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీకి చైర్మన్‌గా క్రీడాశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉంటారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఉద్యోగ నియామకాలు చేపట్టే శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి మెంబర్లుగా ఉంటారు. వీరితో పాటు శాప్‌ ఎండీ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా క్రీడాశాఖ 65క్రీడలకు మాత్రమే 3శాతం రిజర్వేషన్లు అమలుచేస్తుంది. అందులో 36 క్రీడలను ‘ఏ’ కేటగిరీగా, 29 క్రీడలను ‘బీ’ కేటగిరీగా విభజించింది. ఏ కేటగిరీకి తొలి, బీ కేటగిరీకి రెండో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒలింపిక్స్‌, పారాలింపిక్‌ క్రీడలకు గ్రూప్‌-1, గ్రూప్‌-2లో ప్రాధాన్యత ఇస్తారు.

Updated Date - May 16 , 2026 | 04:48 AM