Share News

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:29 AM

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెనూ పక్కాగా అమలు, హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు సాంకేతిక విద్య పకడ్బందీగా అందించేలా చర్యలు చేపట్టింది.

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై ప్రత్యేక దృష్టి

  • సచివాలయంలో ముగ్గురు మంత్రులు భేటీ

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెనూ పక్కాగా అమలు, హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు సాంకేతిక విద్య పకడ్బందీగా అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంత్రులు సవిత, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎన్‌ఎండీ ఫరూక్‌ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై చర్చించారు. నాణ్యమైన ఆహారం, విద్య, ఆరోగ్య భద్రత అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గురుకులాల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్షేమ వసతి గృహాల తనిఖీకి ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ బృందాలు తరచూ హాస్టళ్లను సందర్శించి, పనితీరు మెరుగుకు కృషి చేస్తాయని మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయా సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 04:29 AM