హస్త కళాకారులకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:42 AM
చేనేత, హస్తకళల రంగాన్ని బలోపేతం చేసేందుకు, కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు.
భారత్ టెక్స్‌లో ఏపీ స్టాల్‌ను సందర్శించిన మంత్రి సవిత
నేడు ఢిల్లీలో లేపాక్షి ఎంపోరియం ప్రారంభం
న్యూఢిల్లీ, అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): చేనేత, హస్తకళల రంగాన్ని బలోపేతం చేసేందుకు, కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘భారత్ టెక్స్ 2026’ అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ (లేపాక్షి) పెవిలియన్‌ను ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ(లేపాక్షి) చైర్మన్ హరిప్రసాద్‌తో కలిసి మంత్రి సవిత గురువారం సందర్శించారు. పెవిలియన్‌లోని వివిధ స్టాళ్లను పరిశీలించి, హస్తకళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో మంత్రి సవిత భేటీ అయ్యారు. అరవింద్ ఫ్యాబ్రిక్ సీఈవో డాక్టర్ పరమ్ షా, భారత్ టెక్స్ 2026 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నరేన్ గోయోంకాతో పలు అంశాలపై చర్చించారు. తమది పెట్టుబడిదారుల అనుకూల ప్రభుత్వమని, ప్రభుత్వం తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సవిత వారిని కోరారు.