Share News

81 మంది నుంచి వేల ఫిర్యాదులా.. ఏంది బాసూ సంగతి!?

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:54 AM

ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎవరికైనా నాలుగైదు సమస్యలుండడం, వాటిపై ఫిర్యాదు చేయడం సహజమే. కానీ, విచిత్రంగా రాష్ట్రంలో కొంతమందికి వేలకొద్దీ సమస్యలు ఉంటున్నాయి.

81 మంది నుంచి వేల ఫిర్యాదులా.. ఏంది బాసూ సంగతి!?

  • వాటి ముసుగులో ప్రధాన శాఖలపై గురి

  • ఆ కొద్ది మంది నుంచే వేల సంఖ్యలో దాఖలు

  • ఎక్కువగా రెవెన్యూ, పోలీస్‌, హౌసింగ్‌పైనే..

  • కూటమి సంస్కరిస్తున్న రంగాలు ఇవి

  • వాటిపైనే వందల్లో ఫిర్యాదులు

  • ఫిర్యాదుల తీరు, వాస్తవాలపై సర్కారు ఫోకస్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎవరికైనా నాలుగైదు సమస్యలుండడం, వాటిపై ఫిర్యాదు చేయడం సహజమే. కానీ, విచిత్రంగా రాష్ట్రంలో కొంతమందికి వేలకొద్దీ సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలను కాగితంపై రాసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల సేవలపై ఇలా వందలు, వేల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నవారు 81 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఆర్టీఐ పేరుతోనూ కొందరు అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించాలని భావిస్తోంది. ఒక్కొక్కరికే ఇన్ని వేల సమస్యలు ఎందుకొస్తున్నాయనేది తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఒకే వ్యక్తికి 2,662 సమస్యలు?!

పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల-1 సచివాలయ పరిధిలో ఉండే మిరియాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి 2,662 సమస్యలు ఉన్నాయి. తాను ఫిర్యాదు రూపంలో ఇచ్చిన ఇన్నివేల సమస్యల్లో కనీసం 20 సమస్యలైనా ఆ వ్యక్తికి గుర్తుంటాయా అనేది సందేహమే. ఆయన ఎక్కువగా రెవెన్యూ శాఖపైనే ఫిర్యాదులు ఇచ్చారు. సాధారణంగా రెవెన్యూశాఖపై ఫిర్యాదులు ఎక్కువగానే వస్తుంటాయి. అయితే, ఒకే వ్యక్తి పెట్టిన 2,662 ఫిర్యాదులు పరిష్కరించాలంటే, ఎంతమంది సిబ్బంది కావాలి? ఉన్న సిబ్బంది పనులన్నీ మానుకుని ఇవి ఎంతవరకు సమంజసమో కనిపెట్టడానికైనా కొన్ని సంవత్సరాలు పడుతుంది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లె సచివాలయ పరిధిలో ఉండే బీఎన్‌ ప్రసాద్‌ అనే వ్యక్తికి ఏకంగా 863 సమస్యలు ఉన్నాయి. ఈయన ఎక్కువగా రెవెన్యూ శాఖపైనే ఫిర్యాదులు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం సచివాలయ పరిధిలో ఉండే కందిపల్లి సతీశ్‌ అనే వ్యక్తికి 388 సమస్యలు ఉన్నాయి. ఈయన కూడా ఎక్కువగా రెవెన్యూశాఖపైనే ఫిర్యాదులు చేశారు.


పోలీసుల సంఖ్య కంటే ఫిర్యాదులే ఎక్కువ.

కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం వీఎన్‌ పల్లి సచివాలయం పరిధిలో ఉండే పీవీ వెంకట నాగప్రసాద్‌ అనే వ్యక్తి 1,090 ఫిర్యాదులు చేశారు. ఈ వ్యక్తి ఎక్కువగా రాష్ట్ర పోలీసుశాఖపై ఫిర్యాదు చేశారు. ఆ మండలంలోని పోలీసుల సంఖ్య కంటే ఈయన ఫిర్యాదులే ఎన్నో రెట్లు ఎక్కువం.

‘పుర’పై 543 ఫిర్యాదులు

కోన సీమ జిల్లా ముమ్మిడివరం మండలం గొల్లవీధి సచివాలయ పరిధిలో ఉండే బూసి సురేశ్‌బాబు అనే వ్యక్తి 543 ఫిర్యాదులు చేశా రు. ఈ వ్యక్తి ఎక్కువగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఫిర్యాదులు ఇచ్చారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి సచివాలయం పరిధిలో ఉండే గుజ్జర్లపూడి రత్నసౌభాగ్యం అనే వ్యక్తి 291 ఫిర్యాదులు చేశారు. ఎక్కువగా హౌసింగ్‌ కార్పొరేషన్‌పై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలోని వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, విపత్తు నిర్వహణ, స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, గ్రామీణాభివృద్ధి, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పాఠశాల విద్యాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్‌ శాఖ, సర్వే సెటిల్మెంట్ల విభాగంపై ఆ 81 మంది వందల కొద్దీ ఫిర్యాదులు చేశారు. ఈ విభాగాల సిబ్బంది తమ ఉద్యోగ బాధ్యతలతో పాటు ఒకే వ్యక్తి నుంచి వచ్చే వేల, వందల ఫిర్యాదుల్లో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఏ శాఖలో ఎక్కువ సంస్కరణలు తెస్తున్నారో ఆ శాఖలపైనే ఎక్కువగా వీరి నుంచి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం. సంస్కరణలు అమలైతే ప్రజలకు మెరుగైన సేవలందడంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో ఇలా వేల, వందల ఫిర్యాదులు చేస్తున్నారా? లేదా వ్యక్తిగత అజెండాలు ఏమైనా ఉన్నాయా?... అనే కోణంలో ప్రభుత్వం పరిశీలన చేపట్టింది.


ఎవరీ 81 మంది?

రాష్ట్రంలో ఐదు కోట్లకుపైగా జనాభా ఉండ గా, కేవలం 81 మందికే ఇన్ని సమస్యలు ఎం దుకు వస్తున్నాయి? దీనివెనుక ప్రభుత్వ పనితీరును దెబ్బ తీయాలన్న దురుద్దేశాలు ఏమై నా ఉన్నాయా? అన్న కోణంలో ప్రభుత్వం ఇప్పుడు పరిశీలన చేస్తోంది. కుప్పలుతెప్పలుగా వస్తున్న ఇలాంటి ఫిర్యాదుల వల్ల సిబ్బంది అందులో ఇరుక్కుపోతున్నారని, ప్రభుత్వ విధానాలు, సంస్కరణల అమలుకు సమయం ఉండట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పరిశీలనలో సమంజసమైనవని తేలిన సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని భావిస్తున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 05:55 AM