జిల్లా స్థాయిలో లాజిస్టిక్ సెల్ ఏర్పాటు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:38 AM
రాష్ట్రంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించిన విమానాశ్రయాలు, లాజిస్టిక్ హబ్‌లకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు...
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించిన విమానాశ్రయాలు, లాజిస్టిక్ హబ్‌లకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు వీలుగా జిల్లా స్థాయిలో లాజిస్టిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెల్‌కు జిల్లా కలెక్టరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ జిల్లా ఇంజనీరు, జిల్లా పర్యాటకాధికారి, ఏపీఏడీసీఎల్ సీజీఎం, మునిసిపల్ కార్పొరేషన్ల వైస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఎయిర్ అథారిటీల ప్రతినిధులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ నెలకు ఓసారి భేటీ అయ్యి ఎయిర్‌పోర్టు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు, అప్రోచ్ రోడ్లు, ఎయిర్‌పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుంది.