గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:22 AM
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు.
కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్-ఫ్రీ కరిక్యులం
మంత్రుల ఉపసంఘం భేటీలో మంత్రి లోకేశ్ ఆదేశాలు
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన అమరావతి సచివాలయంలో బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠినచర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్ ఫ్రీ ఏపీ కరిక్యులమ్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈగల్ యాప్‌ను లీప్ యాప్‌కు అనుసంధానించాలని లోకేశ్ నిర్దేశించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను ఈ సమావేశంలో అధికారులు వివరించారు. జీరో గంజాయి సాగు రాష్ట్రంగా ఏపీ మారిందని అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.