Share News

ఏడాది చివరికల్లా రీసర్వే పూర్తి!

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:25 AM

రీసర్వే, రాజముద్రతో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల (పీపీబీ) పంపిణీని కూటమి ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా...

ఏడాది చివరికల్లా రీసర్వే పూర్తి!

  • జనవరి నుంచి ఇప్పటి వరకు 22.79 లక్షల పాస్‌ పుస్తకాల పంపిణీ

  • వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 9,956 గ్రామాల్లో 62,04,000 పీపీబీలు ఇవ్వాలనేది లక్ష్యం

  • నేడు బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన

  • అన్నదాతలకు పాస్‌పుస్తకాల అందజేత

బాపట్ల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రీసర్వే, రాజముద్రతో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల (పీపీబీ) పంపిణీని కూటమి ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 6,976 గ్రామాల్లో పూర్తయింది. 22.79 లక్షల పాస్‌పుస్తకాలను రైతులకు అందించింది. ఈ ఏడాది చివరినాటికి మిగతా గ్రామాల్లో కూడా రీసర్వే పూర్తిచేసి.. 62,04,000 పీపీబీలు ఇవ్వాలని లక్ష్యం గా నిర్దేశించుకుంది. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి రానున్నారు. ‘మీ భూమి-మీహక్కు’ కార్యక్రమంలో పాల్గొ ని అన్నదాతలకు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సూరేపల్లి రెవెన్యూ గ్రామం లో మొత్తం 1,130.30 ఎకరాల విస్తీర్ణం ఉండగా రీసర్వే అనంతరం రెవెన్యూ శాఖ 504 పాస్‌పుస్తకాలను ముద్రించింది. వీటిని సీఎం స్వయంగా అన్నదాతలకు అందజేస్తారు. జగన్‌ ఏలుబడిలో రీసర్వే పేరిట నానా హడావుడిచేసి అనేక భూ వివాదాలకు గ్రామాల్లో ఆజ్యం పోశారు. తాతతండ్రులు సంపాదించుకున్న పొలాల హద్దురాళ్లు, పాస్‌ పుస్తకాలపైనా తన ఫొటోలు ముద్రించుకున్నారు.


కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే వాటిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రాజముద్రతో పాస్‌పుస్తకాలిస్తోంది. ఈ ఏడాది జనవరిలో 4,783 గ్రామా ల పరిధిలో 18.77 లక్షల పాస్‌పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16.129, మార్చిలో 299 గ్రామాల పరిధిలో 1,29,298.. మొత్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పీపీబీలను అందించింది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడంతో పాటు పాస్‌పుస్తకాల పంపిణీని వచ్చే ఏడాది ప్రథమార్థం కల్లా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది.


నెలల వారీగా లక్ష్యాలిలా...

2027 మార్చినాటికి 7,518 సిగ్నల్‌ గ్రామాల్లో 47,02,000 పీపీబీలు, ఏప్రిల్‌ నాటికి 2,438 నాన్‌ సిగ్నల్‌ గ్రామాల్లో 15,02,000 పాస్‌ పుస్తకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. బాపట్ల జిల్లా పరిధిలోని 8 మండలాల్లో 3,658 పీపీబీలు, వేమూరు నియోజకవర్గ పరిధిలో 1,795 పాస్‌ పుస్తకాలను గురువారం రైతులకు అందించనున్నారు. అన్నదాతలకు తెలియకుండా భూ రికార్డులు మార్చలేని విధంగా ప్రభుత్వం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని అమల్లోకి తీసుకురాబోతోంది. 5 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తోంది.

సీఎం పర్యటన ఇలా..

సీఎం గురువారం ఉదయం 10:50 గంటలకు హెలికాప్టర్లో భట్టిప్రోలు మండలం సూరేపల్లికి చేరుకుంటారు. 11:00కు అక్కడ ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 1:35 గంటలకు సూరేపల్లి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడతారు. 2:10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:05 గంటలకు అమరావతి చేరుకుంటారు.

Updated Date - Apr 09 , 2026 | 05:25 AM