Share News

ఉద్యోగులకు ఊరట

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:37 AM

ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కూటమి సర్కారు ఊరట కలిగించనుంది. రూ.7358 కోట్ల మేర పెండింగ్‌ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంది.

ఉద్యోగులకు ఊరట

  • ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

  • 7358 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కూటమి సర్కారు ఊరట కలిగించనుంది. రూ.7358 కోట్ల మేర పెండింగ్‌ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై గురువారం సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగులకు పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. సీఎం సూచనల మేరకు కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరుపుతున్నామని అధికారులు వివరించారు. మొత్తం రూ.7358 కోట్ల మేర పెండింగ్‌ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిల కింద రూ.1848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కింద 4793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ.3411 కోట్లు, పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ కింద రూ.1800 కోట్లు, పోలీస్‌ శాఖకు సంబంధించి అదనపు సరెండర్‌ లీవుల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు సహా అన్ని రకాల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు జరపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమీక్షా సమావేశంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటీరియల్‌ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైనా సీఎం ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్‌ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల బకాయిల చెల్లింపులు చేశామని అధికారులు తెలిపారు. పనులు చేసిన, మెటీరియల్‌ సరఫరా చేసిన వాళ్లకు బిల్లుల చెల్లింపులు జరిపే ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Apr 03 , 2026 | 05:37 AM