చంద్రయ్య కుమారుడికి లైన్ క్లియర్!
ABN , Publish Date - May 15 , 2026 | 04:26 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, సిబ్బంది సరళీకరణ, వేతన సవరణ చట్టాన్ని ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రచురించింది.
ఉద్యోగ నియామకానికి తొలగిన అడ్డంకులు
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, సిబ్బంది సరళీకరణ, వేతన సవరణ చట్టాన్ని ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసుల్లో నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా, వేతన నిర్మాణ సరళీకరణ(రెండో సవరణ) చట్టం-2025కు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో.. చట్ట సవరణకు న్యాయ శాఖ గెజిట్ జారీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, దీనిని వైసీపీ వ్యతిరేకించింది. మండలిలో బిల్లును అడ్డుకుంది. రాజకీయ ప్రేరేపిత ఘర్షణలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. తాజాగా న్యాయ శాఖ గెజిట్ జారీ చేయడంతో తోట చంద్రయ్య కొడుకు వీరాంజనేయులుకు ఉద్యోగం ఇవ్వడానికి అడ్డంకి తొలగిపోయింది. వీరాంజనేయులు నియామకానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.