వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:55 AM
కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు కృష్ణా జిల్లాలో 103 మందికి, కర్నూలు జిల్లాలో 106 మందికి తాజాగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అంతకుముందు చేపట్టిన బదిలీల్లో మార్గదర్శకాలు పాటించలేదని, తమ ఆప్షన్లు పరిగణనలోకి తీసుకోలేదని పలువురు అగ్రికల్చరల్ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తాజా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. మొదట సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు కావడంతో డివిజన్ బెంచ్ కేసును విచారించి కీలక ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులకు తాజాగా బదిలీలు నిర్వహించాలని, ముందుగా ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా బదిలీలు చేయాలని, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, కోరుకున్న స్థానం ఇవ్వలేకపోతే కారణాలు తెలియజేయాలని, కొత్త బదిలీలు పూర్తయ్యే వరకు ఉద్యోగులు ప్రసుతం ఉన్నచోటనే కొనసాగాలని, మొత్తం ప్రక్రియను మార్చి నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతేడాది జూన్ నుంచి బదిలీలపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కేసులో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు విభాగం డైరెక్టర్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అనంతరం కృష్ణా, కర్నూలు జిల్లాల కలెక్టర్లు బదిలీల ప్రక్రియను అమలు చేస్తారు.