రూ.790 కోట్లతో హంద్రీనీవా కాలువ విస్తరణ
ABN , Publish Date - May 27 , 2026 | 05:31 AM
కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి చేర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్ఎస్)-2లో మూడు ప్రధాన పనులను రూ.790 కోట్లతో చేపట్టేందుకు మంగళవారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిపాలనా ఆమోదం ఇచ్చారు.
3 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపిన జల వనరుల శాఖ
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి చేర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్ఎస్)-2లో మూడు ప్రధాన పనులను రూ.790 కోట్లతో చేపట్టేందుకు మంగళవారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిపాలనా ఆమోదం ఇచ్చారు. రూ.159.20 కోట్లతో అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ కాలువ అభివృద్ధి పనులను 0.000 కిలోమీటర్ల నుంచి 20.000 కిలోమీటర్ల వరకూ చేపడతారు. ఈ పనుల్లో సీఎం అండ్ సీడీ వర్క్స్ కూడా ఉంటాయి. మడకశిర బ్రాంచి కెనాల్ టన్నెల్ లైనింగ్ పెనుగొండ మండలం దాకా ఉంటుంది. ఈ పనులకు కొనసాగింపుగా 20.000 కిలోమీటర్ల నుంచి 53.300 కిలోమీటర్ల దాకా అదనపు వెంట్‌లను (నీటి ప్రవాహ దారులు) 18.18 క్యూసెక్కుల సామర్థ్యంతో రూ.477.18 కోట్లతో సీఎంఅండ్‌సీడీ వర్క్స్ చేపడతారు. ఈ పనులను కొనసాగిస్తూ 53.300 కిలోమీటర్ల నుంచి 71.000 కిలోమీటర్ల దాకా మడకశిర బ్రాంచి కెనాల్‌లో 18.18 క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళ్లేలా అదనపు దారులు (వెంట్) సీఎం అండ్ సీడీ పనులు చేపట్టేందుకు రూ.154 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఈ పనులన్నీ ఆమోదించిన డిజైన్ల మేరకే చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఈ సీడీవో డిజైన్లు, డ్రాయింగులు, లైనింగ్‌లు, స్ట్రక్చర్లు, కాలువ వెడల్పు తదితర అంశాలను ముందుగానే స్పష్టం చేస్తారని వెల్లడించారు. ఇసుకపై ప్రభుత్వ తాజా విధానం అమలవుతుందని పేర్కొన్నారు.